
ఖైరతాబాద్, వెలుగు : టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ లంబాడీలకు అన్యాయం చేసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆరోపించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో నాయకులు శ్రీనివాస్ నాయక్, బాలాజీ నాయక్, భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీ తెగకు చెందిన బెల్లయ్య నాయక్‌కు టికెట్ కేటాయించలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నామని, తమకు అన్యాయం చేసిన ఏ పార్టీ కూడా రాజకీయంగా మనుగడ సాధించదని హెచ్చరించారు. కోట్లు ఇచ్చిన వారికే రేవంత్‌రెడ్డి సీట్లు ఇచ్చారని వారు ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతో తిరిగిన వ్యక్తి బెల్లయ్య నాయక్ అనిపేర్కొన్నారు. పేద స్టూడెంట్లకు ఇప్పటివరకు స్కాలర్షిప్ఇవ్వని బీఆర్ఎస్ను ఓడించాలన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజ విద్యార్థి సంఘానికి ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు. సమావేశంలో మల్లేశ్ పాల్గొన్నారు.