ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వినోద్

ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వినోద్
  •     సీటు బెల్టు పెట్టుకోనివారిని జైలులో వేసేలా చట్టాలు తేవాలి: ఎమ్మెల్యే వినోద్ 

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. తాండూర్​మండలం కొత్తపల్లి వారసంత ఆవరణలో తాండూర్​పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీఐ దేవయ్య అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జాతీయ రహదారి భధ్రత కమిటీ చైర్మన్, కలెక్టర్​కుమార్​దీపక్, ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, సబ్​కలెక్టర్​మనోజ్ చీఫ్​గెస్టులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత సూత్రాలు పాటించాలన్నారు. సీట్​బెల్ట్​ధరించకుండా వాహనాలు నడిపే వారిని జైలులో వేసేలా కొత్త చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కలెక్టర్, డీసీపీ మాట్లాడుతూ.. రహదారి నియమాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు. 

అనంతరం రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబలకు ఎమ్మెల్యే వినోద్, బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం, తాండూర్​ఫర్టిలైజర్​యూనియన్​నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి , డీసీసీ ఉపాధ్యక్షుడు రవీందర్​రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్​మహేందర్​రావు, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​మురళీధర్​రావు, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, ఎండీ ఈసా, తహశీల్దార్​జ్యోత్స్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.