సింగరేణి హాస్పిటల్​ను మూసేస్తే ఊరుకోం : గడ్డం వినోద్

సింగరేణి హాస్పిటల్​ను మూసేస్తే ఊరుకోం : గడ్డం వినోద్
  •     సీఎండీ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ను మూసివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను యాజమాన్యం నిలిపివేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం బెల్లంపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి సంస్థలో బెల్లంపల్లికి చెందిన వేలాది మంది కార్మికులు పనిచేస్తూ, ఇక్కడే నివసిస్తున్నారని.. సింగరేణి యాజమాన్యం ఇక్కడి సింగరేణి ఆస్పత్రిని మూసివేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

ఆస్పత్రికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని విభాగాలు ఓపెన్ చేయించడంతోపాటు, మెడికల్ సిబ్బంది, వైద్య నిపుణులను నియమించేందుకు సింగరేణి సీఎండీ బలరాం నాయక్​తో మాట్లాడతానన్నారు. ఆస్పత్రి మూసివేస్తారనే వదంతులను కార్మికులు నమ్మొద్దని కోరారు. నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడంతోపాటు, సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న అర్హులైనవారికి పట్టాలు ఇప్పిచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బెల్లంపల్లి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనని, ఆడా ప్రాజెక్టు నీరు కాకుండా గోదావరి నీరు మున్సిపాలిటీ ప్రజలకు ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, నాయకులు మత్తమారి సూరిబాబు, సిద్ధం శెట్టి రాజమౌళి, బండి ప్రభాకర్ యాదవ్, చిలుముల శంకర్, నాతరి స్వామి, గెల్లి జయరాం యాదవ్, రొడ్డ శారద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.