ఔట్ సోర్సింగ్లో బినామీలు..మంచిర్యాల కార్పొరేషన్లో ఇష్టారాజ్యం

ఔట్ సోర్సింగ్లో బినామీలు..మంచిర్యాల కార్పొరేషన్లో ఇష్టారాజ్యం
  • ఔట్ సోర్సింగ్​లో బినామీలు
  • మంచిర్యాల కార్పొరేషన్​లో ఇష్టారాజ్యం
  • ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నా పట్టించుకోని అధికారులు 
  • ప్రభుత్వానికి పంపే లిస్టులో పేర్లు ఎక్కించేందుకు వసూళ్లు 
  • చనిపోయినవారి ప్లేస్​లో కుటుంబీకులకు మాత్రం నో చాన్స్​ ​ ​ 
  • 60 సంవత్సరాలు దాటిన వర్కర్ల విషయంలోనూ అదే తీరు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ విభాగంలో బినామీ ఉద్యోగులు కొలువుదీరారు. శానిటేషన్ డిపార్ట్​మెంట్​లో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకున్న పలువురు తమ జాబ్​లను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు. మరికొందరి స్థానంలో వారి బినామీలు పనిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వివరాలు అడగడంతో ఉద్యోగాలు కొనుక్కున్నవారు, బినామీలు లిస్టులో తమ పేర్లు ఎక్కించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సానిటేషన్ విభాగం అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కలిసి ఈ తతంగం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకరికి బదులు మరొకరు 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్​లో మొత్తం 513 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరి నియామకాలను రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించడంతో వారు అక్రమాలకు తెరలేపారు. ఏజెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షలకు పైగా వసూలు చేయగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా అందినంత దండుకుని ఉద్యోగాలు పెట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శానిటేషన్ విభాగంలో పనిచేయడం ఇష్టం లేని పలువురు తమ ఉద్యోగాలను ఇతరులకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు అమ్ముకున్నట్టు తెలిసింది. ఇలా దాదాపు పది మంది వరకు పనిచేస్తుండగా జీతాలు కూడా వారి ఖాతాల్లోనే వేస్తున్నట్టు సమాచారం. 

పేర్లు ఎక్కించేందుకు వసూళ్లు

ఔట్​సోర్సింగ్​ఉద్యోగాల పేరిట జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్​వివరాలు అడిగింది. దీంతో ఈ జాబితాలో తమ పేర్లు ఎక్కించేందుకు ఉద్యోగాలు కొనుక్కున్నవారు, బినామీలు పైరవీలు చేస్తున్నారు. ఇదే అదునుగా శానిటేషన్ విభాగం అధికారులు, ఔట్​సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై ఒక్కొక్కరి దగ్గర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు డిమాండ్​ చేస్తున్నట్టు సమాచారం. 

ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేవి అరకొర జీతాలు కావడంతో వారు రెండు, మూడు సంవత్సరాలు వెట్టిచాకిరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పనిచేయకపోయినా, చనిపోయినా వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకోవాల్సి ఉండగా.. రూ.లక్షలు దండుకొని బినామీల పేర్లు ఎక్కించేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ పేర్లు మార్చాల్సి వస్తే కార్పొరేషన్​ స్పెషల్​ ఆఫీసర్​గా ఉన్న కలెక్టర్​ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఉన్నతాధికారులకు తెలియకుండానే కొంతమంది అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 

కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వాలి, కానీ..

శానిటేషన్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఎవరైనా చనిపోతే మానవతా దృక్పథంతో వారి స్థానంలో కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వాలి. దీనికి సవాలక్ష రూల్స్​మాట్లాడే అధికారులు మాత్రం ఔట్ సోర్సింగ్​ ఉద్యోగాలు కొనుక్కున్నవారు, బినామీల విషయంలో మాత్రం రూల్స్​కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. 

అలాగే 60 సంవత్సరాలు పైబడిన వర్కర్ల స్థానంలో వారి వారసులకు చాన్స్​ఇవ్వాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. శానిటేషన్, వాటర్​సప్లై విభాగాల్లో పనిచేయాల్సిన మరికొందరు అధికారులను, ఏజెన్సీ నిర్వాహకులను మేనేజ్​ చేసి కార్పొరేషన్​ ఆఫీసులో సెటిలయ్యారు. ఇంకా కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఔట్ సోర్సింగ్​ ఎంప్లాయీస్​కోరుతున్నారు.  

ఎంక్వైరీ జరిపి యాక్షన్​ తీసుకుంటాం 

ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్ ​రిక్రూట్​మెంట్​ను ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగించింది. వారి నియామకాలతో కార్పొరేషన్​కు ఎలాంటి సంబంధం లేదు. ఏయే డిపార్ట్​మెంట్లలో ఎవరెవరు పనిచేస్తున్నారనే లిస్టు మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఒకరి స్థానంలో మరొకరు బినామీలుగా పనిచేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అట్లా ఎవరైనా ఉంటే వెంటనే తొలగిస్తాం. అసలైన ఉద్యోగుల పేర్లనే ప్రభుత్వానికి పంపించాం. లిస్టులో కొత్తగా పేర్లు చేర్పిస్తామని ఎవరైనా మభ్యపెడితే నమ్మవద్దు. దీనిపై ఎంక్వైరీ జరిపించి కార్పొరేషన్​ అధికారుల ప్రమేయం ఉన్నట్టు తేలితే యాక్షన్​తీసుకుంటాం.  - సంపత్​ కుమార్, కార్పొరేషన్ కమిషనర్, మంచిర్యాల​