మరోసారి దూసుకెళ్లిన మార్కెట్లు

మరోసారి దూసుకెళ్లిన మార్కెట్లు
  •  కొత్త గరిష్టాలను టచ్ చేసిన నిఫ్టీ, సెన్సెక్స్‌‌
  •     రికార్డ్‌‌ లెవెల్స్‌‌కు ఫారెక్స్ నిల్వలు
  •     సోమవారం మార్కెట్‌‌కు సెలవు

ముంబై : బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్‌‌లోనూ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను టచ్ చేశాయి. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో శుక్రవారం సెషన్‌‌ను లాభాలతో ముగించాయి.  ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేకపోవడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు  నికర అమ్మకందారులుగా ఉండడంతో మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది.  సెన్సెక్స్ శుక్రవారం సెషన్‌‌లో  182 పాయింట్లు పెరిగి 76,993 దగ్గర  సెటిలయ్యింది. ఇంట్రాడేలో 77,081.30 లెవెల్ దగ్గర సరికొత్త ఆల్ టైమ్‌‌ గరిష్టాన్ని నమోదు చేసింది. 

ఇంట్రాడేలో 23,490 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్  చేసిన  ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ, చివరికి   67 పాయింట్ల (0.29 శాతం) లాభంతో  23,466 దగ్గర క్లోజయ్యింది.  సెన్సెక్స్ ఈ వారాన్ని  299 పాయింట్ల (0.39 శాతం) లాభంతో ముగించగా, నిఫ్టీ 175 పాయింట్లు (0.75 శాతం) పెరిగింది. యూఎస్ ఫెడ్ హాకిష్ కామెంట్స్‌‌ తర్వాత షార్ట్ టెర్మ్‌‌లో  మేజర్ ఈవెంట్స్ ఏం లేవని, ఫలితంగా మార్కెట్ పెరుగుదల పరిమితంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. 

వచ్చే నెలలో  యూనియన్ బడ్జెట్ ఉండడంతో అప్పటి వరకు మార్కెట్‌‌ కన్సాలిడేట్‌‌ అవ్వొచ్చని అంచనా వేశారు. సెన్సెక్స్‌‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, అల్ట్రాటెక్ సిమెంట్‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌, టాటా మోటార్స్‌‌, ఏషియన్ పెయింట్స్ షేర్లు శుక్రవారం ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, టీసీఎస్‌‌, హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్‌‌, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. 

 మిడ్‌‌, స్మాల్ క్యాప్ షేర్లు జూమ్‌‌

మాక్రో ఎకనామిక్ డేటా స్ట్రాంగ్‌‌గా ఉండడంతో మార్కెట్ పెరుగుతోంది.   కిందటి నెలలో ఇండియా నుంచి గూడ్స్ ఎగుమతులు 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కిందటేడాది మే నెలలో ఎగుమతైన 34.95 బిలియన్ డాలర్లతో పోలిస్తే 9 శాతం పెరిగాయి. అలానే ఇంపోర్ట్స్‌‌  కూడా 7.7 శాతం పెరిగి  57.48 బిలియన్ డాలర్ల  నుంచి 61.91 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బ్రాడ్‌‌ మార్కెట్ చూస్తే, బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ శుక్రవారం సెషన్‌‌లో 1.18 శాతం లాభపడగా, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 1.03 శాతం పెరిగింది. ఇండెక్స్‌‌లలో ఇండస్ట్రియల్స్ (1.68 శాతం), క్యాపిటల్ గూడ్స్‌‌ (1.62 శాతం), టెలీకమ్యూనికేషన్‌‌ (1.31 శాతం), ఆటో (1.26 శాతం), కన్జూమర్ డిస్క్రిషనరీ (1.15 శాతం), రియల్టీ (0.94 శాతం) ఎక్కువగా పెరిగాయి.  

మరోవైపు ఐటీ, టెక్ ఇండెక్స్‌‌లు నష్టాల్లో క్లోజయ్యాయి.  తమ బాండ్ బయ్యింగ్ ప్రోగ్రామ్‌‌లో ఎటువంటి మార్పు ఉండదని బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకటించడంతో జపనీస్ మార్కెట్‌‌ లాభపడిందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్  రిటైల్ రీసెర్చ్‌‌ హెడ్‌‌  దీపక్ జాసాని అన్నారు. చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌పై యూరోపియన్ యూనియన్ కొత్త టారిఫ్‌‌లు వేయడంతో  ఈ దేశ మార్కెట్‌‌లు నష్టాల్లో ట్రేడయ్యాయని పేర్కొన్నారు. గ్లోబల్‌‌గా చూస్తే ఏషియన్ మార్కెట్‌‌లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. 

సియోల్‌‌, టోక్యో లాభాల్లో ముగియగా,  హాంకాంగ్‌‌ నష్టాల్లో ట్రేడయ్యింది. యూరోపియన్  మార్కెట్‌‌లు నెగెటివ్‌‌లో కదిలాయి.  విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం సెషన్‌‌లో నికరంగా రూ.2,175 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా రూ.655 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. బ్రెంట్ క్రూడాయిల్‌‌  0.12 % పెరిగి  బ్యారెల్‌‌కు 82.65 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 83.50 దగ్గర ఉంది. బక్రీద్ సందర్భంగా సోమవారం (జూన్ 17)  మార్కెట్‌‌కు సెలవు. 

655 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు

దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 7 తో ముగిసిన వారంలో 4.307 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్ టైమ్ హై అయిన 655.817 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో 4.837 బిలియన్ డాలర్లు పెరిగి 651.51 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. జూన్‌‌ 7 తో ముగిసిన వారంలో  ఫారెన్ కరెన్సీ అసెట్స్ 3.773 బిలియన్ డాలర్లు పెరిగి 576.337 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గోల్డ్ రిజర్వ్‌‌లు 481 మిలియన్లు పెరిగి 56.982 బిలియన్‌‌ డాలర్లకు ఎగిశాయి.