కేసీఆర్‌‌‌‌ ఫామ్‌‌ హౌస్‌‌ ముందు డబుల్‌‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల నిరసన

కేసీఆర్‌‌‌‌ ఫామ్‌‌ హౌస్‌‌ ముందు డబుల్‌‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల నిరసన
  •     లాటరీ తీసినా ఇండ్లు ఎందుకియ్యలే దని ప్రశ్న

గజ్వేల్/ములుగు, వెలుగు: మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని, సమస్యలు చెప్పుకుందామంటే సీఎంగా ఉన్నప్పుడు కలనివ్వలేదని, ఇప్పుడు కూడా అట్లనే చేస్తే తాము ఎక్కడికి పోవాలంటూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూం లబ్ధిదారులు కేసీఆర్​ను ప్రశ్నించారు. కేసీఆర్​ను కలిసే దాకా వెళ్లేది లేదంటూ మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్​హౌస్ ముందు నిరసనకు దిగారు. ‘‘మేమేం పాపం జేసినం సారూ.. ఏండ్ల నుంచి ఇండ్లు కట్టిస్తామని మాటలు చెప్పిన్రు.. లాటరీ తీసి ఇండ్లచ్చినయి చెప్పిన్రు.. కానీ, చేతికి మాత్రం ఇయ్యలే.. ఇల్లు, వాకిలి కోసం ఇంకెన్ని రోజులు ఎదురుసూడాలి’’అని నిలదీశారు. ఫామ్ హౌస్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన లబ్ధిదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా గేటు ముందే నిరసనకు దిగారు. ‘‘కేసీఆర్​ను మూడు సార్లు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించినం. రెండు సార్లు సీఎం అయ్యిండు. అయినా.. మాకు ఇప్పటి దాకా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. సమస్యలు చెప్పుకుందామని సీఎంగా ఉన్నప్పుడు వస్తే కల్వలేదు. ఇప్పుడైనా మా గోడు వింటారని వస్తే.. సార్ కలుస్తలేరు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.

మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిన్రు

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని, లక్కీ డ్రా ద్వారా 1,100 మందిని అధికారులు ఎంపిక చేశారని లబ్ధిదారులు తెలిపారు. కానీ.. ఇప్పటి దాకా ఇండ్ల పట్టాలు, గృహ ప్రవేశం చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరేందుకు ఫామ్​హౌస్​కు వస్తే కేసీఆర్​ను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. ఓట్లేసి గెలిపించిన మమ్మల్నే కేసీఆర్ కల్వరా? అని నిలదీశారు. కలిసేందుకు పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ‘‘సీఎంగా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేశారు? అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు. మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టారు’’అని కేసీఆర్​పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ పీఏ శ్యామ్.. లబ్ధిదారుల వద్దకు వచ్చారు. వినతిపత్రం ఇస్తే తాను కేసీఆర్​కు అందజేస్తానని చెప్పారు. కొంత మంది లబ్ధిదారుల ఫోన్ నంబర్లు ఇస్తే.. సమయం తీసుకుని పిలిచి కేసీఆర్​తో మీటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన లబ్ధిదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.