
బసిర్ హట్(బెంగాల్): సందేశ్ ఖాలీ మహిళల దీనావస్థను చూసి తన గుండె పగిలిపోయిం దని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రాంతంలోని మహిళల ఆత్మ గౌరవంతో బీజేపీ ఆడుకోకూడదని సూచించారు. బీజేపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనే మహిళల పై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు.
బసిర్ హట్లో జరిగిన ఎలక్షన్ ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘సందేశ్ ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలు, అవమానాలకు నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. సందేశ్ ఖాలీకి సంబంధించిన వీడియోలు బయటకు రాకుంటే బీజేపీ ఎలా కుట్ర చేసిందో ప్రజలకు ఎప్పటికి అర్థమయ్యేది కాదు. మహిళల ఆత్మగౌరవంతో బీజేపీ ఆటలాడొద్దు” అని చెప్పారు. బసిర్ హట్ లోక్ సభ సెగ్మెంట్లో తమ అభ్యర్థి హజి నురుల్ గెలిచిన వెంటనే తాను సందేశ్ ఖాలీని సందర్శిస్తానని ఆమె హామీనిచ్చారు.