యూపీఏనా.. అదెక్కడుంది? ఇప్పుడది ఉనికిలోనే లేదు

యూపీఏనా.. అదెక్కడుంది? ఇప్పుడది ఉనికిలోనే లేదు
  • ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే... బీజేపీని ఈజీగా ఓడగొట్టొచ్చు: మమత
  • ‘బీజేపీ హటావో, దేశ్ బచావో’ అంటూ నినాదం
  • 3 రోజులు ముంబై యాత్ర... పవార్, సేనతో చర్చలు

ముంబై: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ ఇచ్చిన కిక్కుతో రానున్న లోక్ సభ ఎన్నికలపై కూడా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇప్పటినుంచే దృష్టి పెట్టారు. కాంగ్రెస్​తో సంబంధంలేకుండా ప్రతిపక్షాలను కలుపుకుని బీజేపీని ఢీకొట్టే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా ముంబైలో 3 రోజుల పాటు పర్యటించారు. మంగళవారం శివసేన లీడర్లతో, బుధవారం ఎన్సీపీ చీఫ్ ​శరద్ పవార్​తో భేటీ అయ్యారు. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ హటావో, దేశ్ బచావో’ నినాదంతో ముందుకు పోతామని ప్రకటించారు. ఇందుకోసం గట్టి ప్రత్యామ్నాయాన్ని కూడగట్టేందుకు తాను ముందుకొచ్చానన్నారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బీజేపీని ఈజీగా ఓడించవచ్చన్నారు. కాంగ్రెస్​ను, ఆ పార్టీ లీడర్ రాహుల్ గాంధీని ఏకిపారేశారు. యూపీఏకు పవార్ నాయకత్వం వహించాలంటారా అని ప్రశ్నించగా, ‘‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది ఉనికిలోనే లేదు” అన్నారు. ‘‘రాజకీయాల్లో రాణించాలంటే నిత్యం కష్టపడాలె. ఎప్పుడు చూసినా విదేశాల్లో గడిపేటోళ్లు మంచి లీడర్లు కాలేరు” అని రాహుల్​కు చురకలంటించారు. ‘‘పవార్​తో చర్చలు బాగా సాగినై. సీనియర్ మోస్ట్ లీడరైన ఆయన ఆలోచనలతో పూర్తిగా ఏకీభవించిన’’ అన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహిస్తారా అని ప్రశ్నించగా తానో చిన్న కార్యకర్తను మాత్రమేనన్నారు. ‘‘అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని(యూఏపీఏ), ఐటీ, ఈడీ తదితరాలను కేంద్రం ఇష్టానికి దుర్వినియోగం చేస్తున్నది. అయినా మేం భయపడేది లేదు. బీజేపీ ఫాసిస్టు పాలనను అంతం చేసేందుకు చివరి శ్వాస దాకా పోరాడుత” అని శపథం చేశారు. మమత కామెంట్లపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, తాము లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కలేనన్నారు. తర్వాత ముంబై సివిల్ సొసైటీ పెద్దలతో మమత భేటీ అయ్యారు. పౌర సమాజ ప్రముఖులతో సలహా మండలిని ఏర్పాటు చేయాలని గతంలోనే కాంగ్రెస్​కు సలహా ఇచ్చానని గుర్తు చేశారు. కానీ లాభం లేకపోయిందన్నారు.

మాది ‘2024 టెంప్లేట్’: పవార్
బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెసేతర ఫ్రంట్ కు ప్లాన్ చేస్తున్నారా అని పవార్ ను ప్రశ్నించగా ఇండైరెక్ట్​గా బదులిచ్చారు. ‘‘బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీనైనా స్వాగతిస్తం. కాంగ్రెసైనా సరే. గట్టి ప్రత్యామ్నాయం అవసరం చాలా ఉన్నది. వచ్చే ఎన్నికల కోసం మేధోమథనం చేస్తున్నం. భావసారూప్యమున్న పార్టీలన్నీ కలిసి రావాలె. మమత రాక అందులో భాగ మే. ఆమెతో చర్చలు ఫలప్రదంగా జరిగినై” అని చెప్పారు. బెంగాల్ సీఎంను కలవడం ఆనందంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ భేటీ ఫొటోలను షేర్ చేస్తూ, ‘టెంప్లేట్ ఫర్ 2024’ అని కామెంట్ చేశారు. శివసేన ముఖ్యులు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ తదితరులతో మమత చర్చలు జరిపారు.