అనుభవించు రాజా: 53 లక్షల రూపాయల బైక్‎పై బీజేపీ మంత్రి చక్కర్లు

అనుభవించు రాజా: 53 లక్షల రూపాయల బైక్‎పై బీజేపీ మంత్రి చక్కర్లు

కోల్‎కతా: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ పొదుపు మంత్రం జపిస్తున్నారు. దేశ ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలని.. ఇంధన వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు. అలాగే, బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువుల కొనుగోళ్లను ఆపేయాలని కోరారు. ప్రధాని పిలుపు మేరకు సామాన్య ప్రజలు కొంత మేర పొదుపు చర్యలు పాటిస్తున్నా.. కొందరు బీజేపీ నేతలు మాత్రం మోడీ మాటను బేఖాతరు చేస్తు్న్నారు. ఓ వైపు మోడీ పొదుపు మంత్రం పఠిస్తుంటే.. మరోవైపు బెంగాల్ బీజేపీ సీనియర్ లీడర్ దిలీప్ ఘోష్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ లగ్జీరీ బైక్ నడపడటం వివాదస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..

బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్, మంత్రి దిలీప్ ఘోష్ గురువారం (మే 28) కోల్‌కతాలోని ఎకో పార్క్‌లో హెల్మెట్ ధరించకుండా రూ.53 లక్షల విలువైన విలాసవంతమైన బైక్‌పై ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయి ఉండి ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. స్వయంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలను దిలీప్ ఘోష్ నిర్లక్ష్యం చేయడాన్ని నెటిజన్లు ప్రశ్నించారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులని.. చట్టాలు కేవలం సామాన్యులకేనని.. ప్రజా ప్రతినిధులకు వర్తించవని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

రాజకీయ నాయకులు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని.. వాళ్లు మాత్రం ఆచరించరని ఇంకొందరు ఎద్దేవా చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్య ప్రజల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూల్ చేసే పోలీసులకు ఇలాంటి మాత్రం కనబడవని ఇంకొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రాఫిక్ చట్టాలు, ప్రభుత్వ సలహాలను పాటించే విషయంలో ప్రజా ప్రముఖులు, ముఖ్యంగా మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని విమర్శకులు వాదిస్తున్నారు.