రాంచీ: విమెన్స్ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో శ్రాచి బెంగాల్ టైగర్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగాల్ 1–-0 తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, ఫస్ట్ క్వార్టర్ 11వ నిమిషంలో బెంగాల్ టైగర్స్ ప్లేయర్ అగస్టినా గోర్జెలానీ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో విన్నింగ్ గోల్ సాధించింది.
ఆ తర్వాత సూర్మా జట్టు ఎదురుదాడికి దిగింది. బంతిని ఎక్కువగా తమ నియంత్రణలో ఉంచుకుని బెంగాల్ గోల్ పోస్ట్ పై దాడులు చేసింది. అయితే బెంగాల్ టైగర్స్ డిఫెన్స్ గోడలా నిలబడింది. సూర్మా టీమ్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను షిహోరి, సలీమా టెటె గోల్స్‌గా మలచలేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
