మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బెంగళూరులో అయితే ట్రాఫిక్‌ను అధిగమించడం ఓ పెద్ద సాహసమే. ఆ సమయాల్లో ట్రాఫిక్ చిరాకు నుంచి బయటపడటానికి ఫోన్‌లో నిమగ్నమవడమో లేదా..ఇష్టమైన పాటలు వింటూనో లేదా ఆఫీసు వర్క్ చేసుకుంటూనో సమయం గడిపేస్తారు. తాజాగా బెంగళూరు నగరంలోని ఓ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించినప్పుడు చోటు చేసుకున్న ఓ ఘటన నెటిజన్లను కదిలించింది.
ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్‌తో కుక్క
బెంగళూరులో ఇటీవల ఓ రోజు ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్ కుక్కతో కనిపించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. శునకాన్ని తన ఒడిలో పెట్టుకుని ట్రాఫిక్ జామ్‌లో వేచి ఉన్న దృశ్యాన్ని కొందరు తమ చరవాణీలలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ ఆ కుక్కను ఎలాంటి ఆటపట్టించకుండా చంటి పిల్లను చూసుకున్నట్లుగా ఎంతో గారాబంగా చూసుకోవడం చూపరులను కదిలించింది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మనసుకు హత్తుకుంటుంది. ఎండ వేడిమి వల్ల అలిసిన ఆ శునకం ముఖాన్ని గుడ్డతో తుడిచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఈ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న వీడియోను అల్కా పాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆమె అమూల్యమైన ఈ క్షణాలను రికార్డ్ చేసింది.
లక్షల కొద్దీ వ్యూస్
ఈ వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌తో పాటు ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్కా ఇటిస్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేశారు. బెంగళూరులో ఓ సాధారణ రోజు అని క్యాప్షన్ జత చేశారు. కాగా మండుటెండలలో మూగజీవులను ఇలా బయటకు తీసుకెళ్లడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. . సోషల్ మీడియా యూజర్లు కామెంట్ సెక్షన్‌లో వీరిద్దరి బంధంపై ప్రశంసలు కురిపించారు. అతడిని చూస్తుంటే చాలా గౌరవం కలుగుతుంది.. అని ఒకరంటే.. మరొక వినియోగదారు "కేవలం స్వచ్ఛమైన ప్రేమ" ఇది మాత్రమే అని వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను చూస్తే ఆటో డ్రైవర్ కాలక్షేపం కోసం కుక్కను బయటకు తీసుకువస్తున్నట్లుగా అనిపించడం లేదు. దాని పరిస్థితి చూస్తుంటే ఏదో అనారోగ్య సమస్యతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. కుక్కను ఆ డ్రైవర్ లాలన చేస్తున్న తీరు చూస్తుంటే బహుశా ఆస్పత్రికి తీసుకువెళ్తున్నారో అని సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు. లేదంటే ఈ మండుటెండలో ఎవరూ అలా బయటకు తీసుకురారు. సాధారణంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శునకాలు బెంగళూరులో ట్రాఫిక్ జామ్, ఎక్కువ సేపు ఇలా ఎండలో ఉండటం వల్ల కూడా అది నీరసపడిపోయి ఉండొచ్చని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే సామర్థ్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆటో రంగానికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ముంబై రైలులో కుక్క ప్రయాణిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.

