న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 55,200కిపైగా స్టార్టప్‌లను గుర్తించామని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. స్టార్టప్ ఇండియా మొదలైన తర్వాత ఒక ఏడాదిలో గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో ఇదే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2.23 లక్షలు దాటింది. ఇవి కలిపి 23.36 లక్షల డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేశాయని ప్రభుత్వం చెబుతోంది. 2025–26లో స్టార్టప్‌ల సంఖ్య ఏడాది లెక్కన 51.6శాతం పెరగగా, ఉద్యోగ కల్పనలో 36.1శాతం వృద్ధి నమోదైంది.
మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎఫ్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్), క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్(సీజీఎస్‌ఎస్) ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఎఫ్‌ఎఫ్ఎస్ కింద రూ.7 వేల కోట్లను 135 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లలో పెట్టుబడి పెట్టింది.
ఈ ఏఐఎఫ్‌లు 1,420 స్టార్టప్‌లలో రూ.26,900 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. సీజీఎస్‌ఎస్‌లో గ్యారంటీ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగగా, 2025–26లో రూ.1,250 కోట్ల విలువైన 410 రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్ కింద 219 ఇంక్యూబేటర్లకు రూ.945 కోట్ల కేటాయింపు జరిగింది. స్టార్టప్‌లు 19,400 పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేశాయి.

