- టీమిండియాకు ఆడాలని కోరిన బీసీసీఐ టాప్ అధికారి
- ఇండియాతో పాటు ఆస్ట్రేలియా
- ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు రషీద్ వెల్లడి
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయం వెల్లడించాడు. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా తనకు పౌరసత్వం ఇచ్చి తమ దేశానికి ఆడాలని ఆఫర్ ఇచ్చాయని తెలిపాడు. కానీ, తన మాతృదేశం అఫ్గానిస్తాన్‌పై ప్రేమతో ఆ రెండు ఆఫర్లను రిజెక్ట్ చేశానని సోమవారం విడుదల కానున్న తన బుక్ ‘రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్’లో పేర్కొన్నాడు. ‘సిటిజన్‌షిప్ తీసుకొని తమ దేశానికి ఆడాలని ఇండియా, ఆస్ట్రేలియా నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి.
కానీ, నేను నా దేశానికి ఆడకపోతే మరే దేశానికి ఆడబోనని స్పష్టం చేశాను’ అని రషీద్ తెలిపాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆఫర్ వివరాలను పూర్తిగా వెల్లడించని స్టార్ ఆల్‌రౌండర్ 2023 సీజన్ ఐపీఎల్ ఆడుతున్నప్పుడు బీసీసీఐ కీలక అధికారి తనను కలిసి ఇండియా పౌరసత్వం గురించి చర్చించాడని వెల్లడించాడు. ‘ఆ ఆఫీసర్‌తో నేను మాట్లాడుతుండగా.. మీ దేశం (అఫ్గానిస్తాన్)లో పరిస్థితి బాగా లేదు. ఇండియాలో ఉండిపో. మేం నీకు సిటిజన్‌షిప్ ఇస్తాం. ఇక్కడే ఉండి, ఇక్కడే క్రికెట్ ఆడు అని చెప్పారు. ఆయన మాటలు నన్ను సర్‌ప్రైజ్ చేశాయి. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. దాంతో ఆయనను చూసి నవ్వి.. థ్యాంక్యూ సో మచ్. నేను నా దేశం అఫ్గానిస్తాన్‌కే ఆడతాను’ అని చెప్పానని రషీద్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

