బెంగళూరు ఇంటి ఓనర్లకు మైండ్ పోయిందా..? 3BHK అద్దె రూ.లక్షా.. మెయింటెన్స్ ఎక్స్‌ట్రా అంట..

బెంగళూరు ఇంటి ఓనర్లకు మైండ్ పోయిందా..? 3BHK అద్దె రూ.లక్షా.. మెయింటెన్స్ ఎక్స్‌ట్రా అంట..

ఐటీ ఉద్యోగులకు కలల నగరంగా చెప్పుకునే బెంగళూరులో రోజురోజుకూ జీవితం పెద్ద కలగానే మారిపోతోంది. నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అని కోటి ఆశలతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళుతున్న యువతకు వాస్తవ పరిస్థితులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్. చచ్చీ చెడి సంపాదించిన డబ్బు ఇంటి ఓనర్లు అద్దెలు, మెయింటెనెన్స్, అడ్వాన్స్ అంటూ దోచుకుంటున్న పరిస్థితులపై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయటం మరోసారి చర్చకు దారితీసింది. 

బెంగళూరు నగరంలోని కోరమంగణ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉద్యోగి సహీల్ ఖాన్ అనే వ్యక్తి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే నగరంలో ఇల్లు అద్దెకు దొరకటం గగనంగా మారిందని, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రేట్లు ఇంటి అద్దెలను భారీగా ప్రభావితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కుక్కీ టౌన్ లో ఇంటి ఓనర్లు నెలకు 3BHKకి ఏకంగా లక్ష రూపాయలు అద్దె డిమాండ్ చేస్తున్నారని పోస్టులో వెల్లడించారు. అసలు ఇంటి ఓనర్లకు మైండ్ ఏమన్నా పోయిందా ఏంటి అంటూ అద్దెలు విని తన షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు. 

చాలా వారాలుగా ఇల్లు అద్దె కోసం వెతుకుతున్నానని.. ఒక్క రోజులో దాదాపు 8 ఇళ్లు చూసినట్లు చెప్పారు సహీల్ ఖాన్. పాత బెంగళూరు కంటోన్మెంట్ ప్రాంతంలో పరిస్థితి ఇలా దారుణంగా ఉందని వెల్లడించారు. తాను రెండు బెడ్ రూమ్స్ ఇంట్లో దాదాపు 3 ఏళ్లుగా ఉంటున్నానని. అందుకు నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. మరో 3బీహెచ్ కే అద్దె రూ.65వేలు ఉందని అయితే రైల్వే ట్రాక్ కి దగ్గరగా ఉండటం వల్ల రేటు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. 

లక్ష రూపాయలు అద్దె డిమాండ్ చేసిన 3BHKలో కబోర్డ్స్, కిచెన్ కేబినెట్స్ తప్ప ఇంకేం లేవని, పైగా అంతగా విశాలంగా కూడా ఏమీ లేదని చెప్పారు ఖాన్. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఇంటి అద్దెకు మెయింటెనెన్స్ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఓనర్స్ చెబుతున్నట్లు తెలిపారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు ఎక్కువగా డబ్బు సంపాదిస్తుండటంతో వారి నుంచి డబ్బులు లాగేందుకు ఓవర్స్ ఇంటి అద్దెలను చాలా ఎక్కువగా చెబుతున్నట్లు ఖాన్ అన్నారు. దీనిపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ ఇంటి ఓనర్స్ ఎక్కువ అద్దె పెట్టి మిమ్మల్ని త్వరగా సొంత ఇల్లు కొనుక్కోమని మోటివేట్ చేస్తున్నారు అంటూ జోక్ చేశారు అధిక అద్దెలపై. మరొకరు ఇది ప్రస్తుతం ట్రెండ్ అయిపోయిందంటూ కామెంట్ పెట్టారు.