ట్రాఫిక్ అంటే ఇదీ : ఫ్రెండ్‌ను విమానం ఎక్కించాడు.. వాళ్లు దుబాయ్‌లో దిగారు.. అతను ఇంటికి చేరలేదు..!

ట్రాఫిక్ అంటే ఇదీ : ఫ్రెండ్‌ను విమానం ఎక్కించాడు.. వాళ్లు దుబాయ్‌లో దిగారు.. అతను ఇంటికి చేరలేదు..!

బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంచు ఇంచు కదులుతూ ఇంటికెళ్లేటప్పటికి ఒంట్లో ఓపికతో పాటు.. వాహనంలో ఇంధనం ఆవిరైపోతున్న పరిస్థితుల గురించి చాలా మంది వాహనదారులు తమ కష్టాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. తమ సగం జీవితం, జీతం ఈ ట్రాఫిక్ లోనే సరిపోతోందంటూ చాలా సార్లు బెంగళూరులోని ప్రజలు తమ కష్టాలను మెురపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఒక బెంగళూరీ తనకు జరిగిన అనుభవాన్ని ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేయటం తెగ వైరల్ అవుతోంది. అతను తన స్నేహితురాలిని బెంగళూరులో విమానం ఎక్కించటానికి వెళ్లాడు. ఆమెను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించి మనోడు ఇంటికి బయలుదేరాడు. అయితే తన ఫ్రెండ్ దుబాయ్ చేరుకుందని.. కానీ తాను మాత్రం బెంగళూరు మహా ట్రాఫిక్ లో చిక్కుకుపోయానని చెప్పాడు. ఇది చూస్తున్న వారు బెంగళూరు రోడ్లపై ఇంటికి చేరుకోవటం కంటే విమానంలో దుబాయ్ వెళ్లటానికే తక్కువ సమయం పడుతుందని అంటున్నారు. గంటలకు గంటలు ఇంచు ఇంచు కదులుతూ నగరంలోని ట్రాఫిక్ లో ప్రయాణం నరకంగా మారుతోందని దీనిని చూసిన వారు చెబుతున్నారు. 

ALSO READ : మార్నింగ్ వాక్ చేస్తుండగా అస్వస్థత.. చెన్నై అపోలో ఆసుపత్రికి తమిళనాడు సీఎం స్టాలిన్

 

తనకు కూడా ఇలాంటి ఘటన జరిగిందంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. తన తల్లిదండ్రులు విమానాశ్రయంలో సెండాఫ్ ఇచ్చి ఇంటికి బయలుదేరారని.. తాను ఢిల్లీ చేరుకున్నంత సమయం వాళ్లు ఇంటికి చేరటానికి పట్టిందని చెప్పాడు. ఒక వ్యక్తి మాత్రం దీనిపై స్పందిస్తూ కావాలని మనుషుల అటెన్షన్ గ్యాథర్ చేసేందుకు చేసిన పోస్ట్ ఇది అంటూ కొట్టిపడేశారు. విమానాశ్రయం నుంచి హెబ్బల్ చేరటానికి 6 గంటలు ఎలా పడుతుందని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి పట్టే సమయం ఎక్కువని చెప్పారు. అయితే మెుత్తానికి బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.