Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. RCBపై కేసు నమోదు

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. RCBపై కేసు నమోదు

బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆర్సీబీపై కేసు నమోదు  చేశారు. ఆర్సీబీతో పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై కూడా కేసు నమోదైంది. ఈవెంట్ మేనేజర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీపై కేసు నమోదు చేసిన విషయాన్ని బెంగళూరు సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ నిర్ధారించారు. సెక్షన్ 105, సెక్షన్ 125(12), సెక్షన్ 142, సెక్షన్ 121, సెక్షన్ 190 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాట ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

తొక్కిసలాట ఘటనపై విచారించిన కర్ణాటక హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 10 లోపు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. బెంగళూరు చిన స్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపడినప్పటికీ స్టేడియం లోపల ఈవెంట్ను కొనసాగించడం వివాదానికి కారణమైంది. బయట హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తూ తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోయినా పట్టనట్టుగా సంబరాలు చేసుకోవడంపై విమర్శలొచ్చాయి.

అసలు చిన్న స్వామి స్టేడియం దగ్గర ఏం జరిగిందంటే..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్గా విజేతగా నిలిచింది. బుధవారం ఉదయం అహ్మదాబాద్ నుంచి జట్టు సభ్యులంతా బెంగళూరుకు చేరుకున్నారు. వీరికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లి సీఎం సిద్ధరామయ్యను కలిశారు. సభ్యులందరినీ ఆయన సన్మానించారు. అసెంబ్లీ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్​ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ.. భద్రతా కారణాల రీత్యా విక్టరీ పరేడ్​ను రద్దు చేసుకున్నారు.

అసెంబ్లీ నుంచి ఆర్సీబీ జట్టు చిన్న స్వామి స్టేడియంకు బయల్దేరింది. బస్సు వెంట వేలాది అభిమానులు పరుగులు తీశారు. జట్టు సభ్యులంతా స్టేడియం లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేడియం మొత్తం నిండిపోయి ఉంది. ఇంకా వేలాది మంది అభిమానులు బయటే ఉన్నారు. 3వ నంబర్ గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని బౌరింగ్ హాస్పిటల్, విట్టల్ మాల్యా రోడ్లోని వైదేహి ఆస్పత్రికి తరలించారు.