తల్లిని చంపి ప్రియుడితో పారిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్

తల్లిని చంపి ప్రియుడితో పారిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్

తల్లిని దారుణంగా చంపి ప్రియుడితో పరారైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమృతను పోలీసులు అరెస్టుచేశారు. రెండురోజుల క్రితం తల్లిని హత్యచేసిన అమృత అండమాన్‌ పారిపోయింది. మూడు రోజుల పాటు గాలించిన తర్వాత పోలీసులు అమృతతో పాటు ప్రియుడు శ్రీధర్‌ రావుని అండమాన్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

అమృత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్‌గా పని చేసిన ఆమె.. కుటుంబ సమస్యల కారణంగా ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. తండ్రి ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా అమృత కుటుంబం దాదాపు రూ.15 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. వీటన్నింటినుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడిని హత్య చేసి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల(52)ను వంటిట్లో ఉన్న చాకుతో దారుణంగా పొడిచింది. అదే సమయంలో నిద్రలేచిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది. తల్లీ, సోదరుడు చనిపోయారని అనుకున్న తర్వాత బ్యాగుతో బయటకు వెళ్ళింది. అప్పటికే ఇంటి బయట బైక్‌పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్‌రావుతో కలిసి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొంది. ఆ బైక్‌ను అక్కడే వదిలేసి..ముందుగానే బుక్‌ చేసుకున్న విమానంలో పోర్ట్‌బ్లెయిర్‌కు పారిపోయారు. అక్కడే ఐదు రోజులపాటు గడిపేవిధంగా వీరు ప్లాన్‌ చేసుకున్నారు. అయితే..కత్తి పోట్లతో అమృత తల్లి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు తమ బంధువులకు ఫోన్‌ చేయడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

పోలీసుల విచారణలో తన ప్రియుడికి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం అండమాన్‌కు వెళ్ళానని అమృత చెబుతోంది. ఇవే కచ్చితమైన కారణాలు కాకపోవచ్చని..మానసిక కారణాలు ఏవైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత తల్లితో కలసి ఈ నెల 2వ తేదీ ఉదయం హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉండగా… తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడింది.