
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ టీవీ నటిపై హత్యాయత్నం జరిగింది. ఇరవైయేళ్లు కలిసి కాపురం చేసిన భర్త.. ఆమెను దారుణంగా పొడిచి చంపేందుకు యత్నించాడు. స్థానికులు రావడంతో పరారయ్యాడు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన ప్రముఖ టీవీ నటి శ్రుతి (మంజుల)పై ఆమె భర్త అమరేష్ కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూలై 4న బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన కన్నడ టీవీ పరిశ్రమలో కలకలం రేపింది.
శ్రుతి, అమరేష్‌లకు 20 యేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రుతి కన్నడ సీరియల్స్, టీవీ షోలలో నటిగా మంచి గుర్తింపు పొందారు. గత 15 యేళ్లుగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు, శ్రుతి వ్యక్తిగత విషయాలపై వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం శ్రుతి తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా గృహహింస కేసు నమోదైంది. ఆ తర్వాత శ్రుతి తన సోదరుడి ఇంట్లో ఉంటోంది.ఇటీవల కుటుంబ సభ్యులు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. అమరేష్ తన ప్రవర్తన మార్చుకున్నాడని చెప్పడంతో శ్రుతి తిరిగి అతనితో కలిసి నివాసం ఉండేందుకు ఒప్పుకుంది.
అంతాబాగానే ఉంది అనుకునే సమయంలో జూలై 4న వారి ఇద్దరు కుమార్తెలు కళాశాలకు వెళ్లిన తర్వాత అమరేష్ శ్రుతిపై దాడిచేశాడు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి ఆ తర్వాత కత్తితో శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడిచాడు. కత్తిదాడిలో పక్కటెముకలు, తొడ, మెడ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను జుట్టు పట్టి లాగి తలను గోడకు కొట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది.
శ్రుతి కేకలు విన్న పక్కింటోళ్లు అక్కడికి చేరుకుని ఆమెను కాపాడారు. ఈ లోగా అమరేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రుతిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆమె శరీరంలో చాలా కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
హనుమంతనగర పోలీసులు శ్రుతి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అమరేష్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటన కన్నడ టీవీ పరిశ్రమలో కలకలం రేపింది.