సెల్ఫీ అంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య.. అదృష్టంతో బతికిన భర్త.. ఇప్పుడు భార్య పరిస్థితి ఏంటీ..?

సెల్ఫీ అంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య.. అదృష్టంతో బతికిన భర్త.. ఇప్పుడు భార్య పరిస్థితి ఏంటీ..?

క్రైమ్.. సస్పెన్స్.. థ్రిల్లర్.. థియేటర్ లో కాదు.. రియల్ లైఫ్ లో.. మన మధ్య.. మన చుట్టూనే చూడవచ్చు అనేలా జరుగుతున్నాయి ఈ మధ్య నేరాలు. డైరెక్టర్లకు, పోలీసులకు కూడా ఊహకు అందనంత ప్లాన్లు, ట్విస్టులతో రెచ్చిపోతున్నారు. భర్త బాధితుల సంఘం అటుంచింతే.. భార్య బాధితుల సంఘం బలోపేతం అయ్యేందుకు మహిళలు కృషి చేస్తున్నారా ఏంటి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఒకరు ముక్కులు ముక్కలుగా నరికి డ్రమ్ లో వేసి సిమెంటు, నీళ్లు పోస్తే.. మరొకరు హనీమూన్ కు తీసుకెళ్లి నట్టడవిలో పాతిపెట్టిన ఘటనలు ఇటీవలే చూశాం. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఇన్సిడెంట్ అంత క్రూరమైంది కాకపోయినా.. క్రిమినల్ బ్రెయిన్ మాత్రం అలాంటిదే అనేలా ఉంది ఈ ఘటన. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం.

కర్ణాటకలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు సరదాగా నది  బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటుండగా భర్త నదిలో పడిపోయి ఆల్ మోస్ట్ చచ్చీ బతికాడు. సెల్ఫీ తీయమని చెప్పి తన భార్యే తనను తోసేసిందని ఆ భర్త అంటుంటే.. నేను తోయలేదు.. తనే పడిపోయాడని భార్య అంటోంది. ఊహకందని ట్విస్ట్ ఉన్న ఈ ఘటన  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

శనివారం (జులై 12) కర్ణాటక రాయిచూర్ జిల్లాలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. భార్య భార్తలు ఇద్దరూ కృష్ణా నది బ్రిడ్జిపై వెళ్తుండగా.. సెల్ఫీ తీయమని అడిగింది భార్య. ఆమె ముచ్చట కాదనకుండా సెల్ఫీ తీసేందుకు ఫోన్ తీసి.. ఇద్దరినీ కవర్ చేస్తూ సెల్ఫీ తీయటం మొదలు పెట్టాడు. సడెన్ గా నీళ్లలో పడిపోవటంతో తన ప్రాణాలు నీళ్లలో కలిసిపోతాయని అనుకున్నాడు. చాలా విశాలంగా పారుతున్న నదిలో ఏ ఒడ్డుకు చేరుదామన్నా ఈదలేనంత దూరం. ఈత వచ్చు కాబట్టి.. ఈదుకుంటూ ఒక రాయిని దొరికంచుకుని.. వేలాడుతూ కూర్చుని ‘‘ కాపాడండి’’.. అంటూ అరవటం మొదలుపెట్టాడు. 

అటుగా వెళ్తున్న గ్రామస్తులు చూసి.. వెంటనే తాడు సహాయంతో ఆ యువకుణ్ని కాపాడారు. నలుగురు లాగుతుండగా తాడును నడుముకు కట్టుకుని ఈదుతూ చివరికి బ్రిడ్జిపైకి ఎక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా ‘‘ ఎందుకు నదిలో దూకావు..’’ అని వాళ్లు ప్రశ్నించగా.. ‘‘నేను దూకలేదు.. నా భార్యే నన్ను తోసేసింది’’ అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. 

►ALSO READ | Shocking Incident:గుహలో ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ..నెలల తరబడి జీవనం..ఎలా వచ్చింది..ఏమి చేస్తోంది

గ్రామస్తులు నీళ్లలో నుంచి ఆ యువకుడిని కాపాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయిచూర్ జిల్లాలోని కడలూర్ గ్రామ సమీపంలో కృష్ణానది దగ్గర ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని నారాయణపేటకు, కర్ణాటక రాయిచూర్ బోర్డర్ లో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. 

నువ్వే తోశావు.. నువ్వే పడిపోయావు.. బ్రిడ్జిపైనే భార్య భర్తల గొడవ:

నదిలో నుంచి బయట పడిన భర్త తాటప్ప కోపంతో ‘‘నువ్వే నన్ను తోసేశావ్’’ అని అరుస్తుండగా.. ‘‘నేను తోయలేదు.. నువ్వే పడిపోయావ్.. ’’ అంటూ సమాధానం చెప్పింది అతని భార్య. ఒకరిపైనొకరు నిందించుకుంటుండగా.. స్పాట్ లో బ్రిడ్జిపైనే వాదన పెరుగుతుండటంతో.. గ్రామస్తులు వాళ్ల పేరెంట్స్ కు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఘటన స్థలానికి చేరుకుని  వాళ్లను ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. 

పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు:

ఇద్దరికీ 2025, ఏప్రిల్ లో పెళ్లి జరిగింది. పెళ్లైన మూడు నెలల్లోనే ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడూ జగడం ఆడుతూనే ఉంటారని అంటున్నారు. ఈ గొడవల కారణంగానే తన భార్య తనను నదిలోకి తోసేసిందని తాటప్ప ఆరోపిస్తున్నాడు. మరి ఈ ఘటనలో భార్య నిజంగా భర్తను చంపేసే ప్లాన్ లో నదిలోకి తోసేసిందా.. లేక ప్రమాద వశాత్తు  పడిపోయి తాటప్పే భార్యను వదిలించుకుందామని నేరం ఆమెపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది. మరో విషయం.. భార్య చంపే ప్రయత్నం చేసిందని భర్త చెప్పిన తర్వాత.. అత్తగారింట్లో ఆమె పరిస్థితి ఏంటి.. భర్త, అత్తింటి వాళ్లు టార్చర్ చేస్తున్నారా లేక తల్లిగారింటికి పంపించారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.