రీల్స్ చేస్తూ.. ఈ బిల్డింగ్ 13వ అంతస్తు నుంచి దూకిందా.. పడిపోయిందా..?

రీల్స్ చేస్తూ.. ఈ బిల్డింగ్ 13వ అంతస్తు నుంచి దూకిందా.. పడిపోయిందా..?

బెంగుళూర్: రోజు రోజుకు యువతలో రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం తలతిక్క పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఇప్పటికే చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ కొంత మంది మారడం లేదు. సోషల్ మీడియాలో వీవ్స్, లైక్స్ కోసం డేంజరస్ స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి రీల్స్ మోజులో 13 అంతస్తుల భవనం పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగుళూరులో జరిగింది.

వివరాల ప్రకారం.. బీహార్‎కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి బెంగుళూరులోని ఒక షాపింగ్ మార్ట్‎లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 25) కొందరు ఫ్రెండ్స్‎తో కలిసి పార్టీ చేసుకునేందుకు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి వెళ్లింది. పార్టీ అనంతరం బిల్డింగ్ టెర్రస్ మీదకెళ్లి రీల్స్ చేస్తుండగా అక్కడ నుంచి కింద పడి మరణించింది. ఈ ఘటనతో బయపడ్డ యువతి ఫ్రెండ్స్ అక్కడి నుంచి పరార్ అయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడిందా..? లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై డీసీపీ (సౌత్ ఈస్ట్) ఫాతిమా మీడియాతో మాట్లాడారు. యువతి భవనంలో తన ఫ్రెండ్స్‎తో కలిసి పార్టీ చేసుకుంది. తరువాత వారు రీల్స్ చేయడానికి టెర్రస్ పైకి వెళ్ళారు. ఈ క్రమంలో యువతి జారిపడి మరణించింది. అసహజ మరణంగా కేసు నమోదు చేశాం. కేసు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విచారణ తర్వాత యువతి మరణానికి కారణమేంటన్నది తెలుస్తుందని చెప్పారు.