సర్కార్‌ దవాఖాన్ల చేరేకన్నా చావే నయం!

సర్కార్‌ దవాఖాన్ల చేరేకన్నా చావే నయం!

హైదరాబాద్, వెలుగు: “అందరూ గవర్నమెంట్ హాస్పిటట్​లా ట్రీట్మెంట్ మంచిగలేదు అంటుంటే తెల్వలే. ఇప్పుడు కళ్లారా చూసినంక ఈడికి వచ్చేకంటే ఇట్లుండుడే నయమనిపించింది. కనీసం ఎట్లున్నరని చూసే దిక్కుండదు. ట్రీట్మెంట్ సంగతి దేవుడెరుగు కనీసం తిండి కూడా సరిగా పెట్టలే. సావును దగ్గర నుంచి సూశినట్లైంది. పాజిటివ్ వస్తే ఇట్లుండుల్లి గానీ సర్కారు దవాఖానకు పోకుళ్లి”.. ఇది కింగ్ కోఠి ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉండివచ్చిన కానిస్టేబుల్ ఆవేదన.

టెస్టు కోసం తిరుగుడు..

కరోనా అని అందరూ భయపడినా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మేం డ్యూటీ చేస్తున్నం. లాక్ డౌన్ లో బందోబస్త్ డ్యూటీ చేసిన. మే 27న జ్వరమొస్తే ప్రైవేట్ హాస్పిటల్ కు పోయిన. అక్కడ చెక్ చేయకుంటే గాంధీకి పోయిన. అక్కడ కూడా లక్షణాలు లేవు టెస్టు చేయమన్నరు. అట్ల అంబర్ పేట్ పోలీస్ హాస్పిటల్, గోషామహల్, పేట్లబుర్జు హెడ్ క్వార్టర్స్ లో టెస్ట్ ల కోసం తిరిగిన. గోషామహల్ పోలీస్ స్టేడియంలో టోకెన్ ఇచ్చి, రెండురోజుల తర్వాత రమ్మన్నరు. మళ్లా పోతే టెస్ట్ లు ఆపేశినమన్నరు. వారం తిరిగినంక చిలకలగూడ పోలీసుల రెఫరెన్స్ లెటర్ తో జూన్ 3న కింగ్ కోఠి  హాస్పిటల్ ల చేరిన. అక్కడ కూడా పై అధికారులతో ఫోన్​ చేయించేదాకా టెస్టులు చేయలే. జూన్ 4న టెస్ట్ లు చేసిర్రు. తెల్లారి పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో అలాగే ఐసోలేషన్ లో అడ్మిట్ అయ్యాను.

నరకం సూశిన..

హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డ్ గుర్తుకొస్తుంటే పైపాణాలు పైనే పోతున్నయి. మేమున్న వార్డ్ లో  17 మంది ఉన్నరు. హాస్పిటల్ ల డాక్టర్లు ఉన్నరో లేరో కూడా తెల్వలే. పీపీఈ కిట్​లు వేసుకున్న సెక్యూరిటీ గార్డులే పేషెంట్లకు దిక్కయిన్రు. వాళ్లే ట్యాబ్లెట్లు, టిఫిన్లు, లంచ్, డిన్నర్ తెచ్చి ఇచ్చేటోళ్లు. పేషెంట్స్ తొందరగా కోలుకోవాలంటే ఇమ్యునిటీ పెరిగే ఫుడ్ పెట్టాలే. కానీ కింగ్ కోఠి హాస్పిటల్ లో పొద్దున ఉప్మా, మధ్యాహ్నం, రాత్రి పప్పు, సాంబార్ తప్ప ఇంకేం లేదు. బయటకు పోలేక ఆడ ఉండలేక అవస్థ పడిన. అక్కడున్నోళ్లు అందరికీ ఒకటే బాత్ రూం. నేనున్న 5 రోజుల్లో ఒక్కసారి కూడా క్లీన్ చేసినట్లు కనిపించలే.

ఇంట్లనే ఉండున్రి

కరోనా వచ్చిందని తెలిస్తే హోమ్ ఐసోలేషన్ లో ఉండండి తప్ప గవర్నమెంట్​ ఆస్పత్రికి పోవద్దు. హాస్పిటల్ ల డాక్టర్లు, నర్సులు ఉండరు. ఎవరూ పట్టించుకోరు. ఇంట్ల ఉంటే ఉన్నది తిని మంచిగైతరు.