బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్.. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు.. త్వరలోనే నిందితులకు సమన్లు

బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్.. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు.. త్వరలోనే నిందితులకు సమన్లు
  • 29 మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు
  • వీరిలో నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రాజ్, 
  • మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల తదితరులు 
  • సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా.. 
  • మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
  • త్వరలోనే నిందితులకు సమన్లు ఇచ్చే చాన్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: 
బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేసిన సెలెబ్రిటీలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పంజాగుట్ట, మియాపూర్‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కేస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ (ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రిజిస్టర్ చేసింది. బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ నటులు, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తున్నది. నిందితులకు త్వరలోనే సమన్లు జారీ చేసి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. జంగ్లీ రమ్మీ, ఏ23, జీత్‌‌‌‌‌‌‌‌విన్, పరిమ్యాచ్, లోటస్ 365 సహా ఇతర బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ గురించి నిందితులు ప్రచారం చేశారని.. అందుకు గాను వాళ్లకు పెద్ద మొత్తంలో కమీషన్ అందిందని ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.  ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌లో విజయ్‌‌‌‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్‌‌‌‌, శోభాశెట్టి, అమృత్‌‌‌‌ చౌదరి, నాయని పావని, నేహా పఠాన్‌‌‌‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్‌‌‌‌, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రిత, కిరణ్‌‌‌‌ గౌడ్‌‌‌‌,  అజయ్‌‌‌‌, సన్నీ, సుధీర్‌‌‌‌, లోకల్‌‌‌‌ బాయ్‌‌‌‌ నాని తదితరుల పేర్లు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా వీళ్లందరినీ ఈడీ విచారింనుంది. ఇందుకోసం షెడ్యూల్ ఖరారు చేయనుంది. బెట్టింగ్‌‌‌‌ యాప్స్ ప్రమోషన్ ​కోసం చేసుకున్న అగ్రిమెంట్లు సహా నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించనుంది.  

ఒక్కసారి ప్రమోషన్..  రోజూ సంపాదనే! 

యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ, కోల్‌‌‌‌కతా, బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా సెలబ్రెటీలను, యూట్యూబర్లను ప్రమోటర్లుగా ఎంచుకున్నారు. యువతను ఆకట్టుకునేలా టాలీవుడ్‌‌‌‌, బాలీవుడ్ సెలెబ్రిటీలు సహా ప్రముఖ యాంకర్లతో ప్రమోషన్​ చేయించారు. సెలబ్రెటీలు ప్రమోట్‌‌‌‌ చేసిన బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ వీడియోలను ఆయా సంస్థల నిర్వాహకులు ఇన్‌‌‌‌స్ట్రాగ్రామ్ సహా వివిధ సోషల్‌‌‌‌ మీడి యా గ్రూపుల్లో సర్క్యులేట్‌‌‌‌ చేసేవారు. ఆయా గ్రూపుల్లోని బెట్టింగ్ యాప్స్‌‌‌‌లలో డిపాజిట్లు చేసేవారి రిజిస్ట్రేషన్‌‌‌‌, జాయినింగ్‌‌‌‌ ద్వారా బోనస్ ఇచ్చేవారు. డిపాజిట్లపై ఇన్సెంటివ్‌‌‌‌, లాస్ పేమెంట్‌‌‌‌పై బోనస్ అంటూ చైన్‌‌‌‌ సిస్ట మ్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా సెలెబ్రిటీలతో ప్రమోషన్​చేయించేవారు. ఇలా వచ్చిన డిపాజిట్లపై కమీషన్లు కూడా సెలెబ్రెటీల ఖాతాల్లోకి వెళ్లేవి. ఈ లెక్కన ఒక్కసారి చేసిన ప్రమోషన్‌‌‌‌కు నిత్యం లక్షల్లో ఆదాయం సమకూరేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వీడియోలు, పాప్-అప్ ప్రకటనల ద్వారా బెట్టింగ్, క్యాసినోలను ప్రోత్సహించేందుకు యూట్యూబర్లు, సెలె బ్రిటీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని గుర్తించారు. 

బెట్టింగ్ యాప్‌‌‌‌లకు బలైతున్న యువత.. 

బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ను ప్రమోట్​చేసిన సెలెబ్రిటీలు కోట్లలో సంపాదిస్తుండగా, వారి మాటలు నమ్మి వాటిల్లో బెట్టింగ్ పెట్టి మోసపోతున్న యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్‌‌‌‌ను ప్రమో ట్‌‌‌‌ చేసిన సెలెబ్రిటీలపై హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పొట్లపల్లి రెసిడెన్సీకి చెందిన ఫణింద్ర వర్మ అనే సామాజిక కార్యకర్త గతేడాది మార్చిలో మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సెలెబ్రిటీల మాటలు నమ్మి తమ కాలనీలోని యువత  బెట్టింగ్‌‌‌‌, క్యాసినోకు అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో సెలెబ్రిటీలు ప్రమోట్‌‌‌‌ చేసిన యాప్స్‌‌‌‌ ద్వారా వారంతా  ప్రభావితమవుతున్నట్లు పేర్కొన్నారు. తాను కూడా బెట్టింగ్ యాప్ చూసి ప్రభావితమయ్యానని, ఓ బెట్టిం గ్ యాప్‌‌‌‌లో డిపాజిట్ చేయబోయానని వెల్లడించారు. సమాజానికి హాని కలిగిస్తున్న  బెట్టింగ్, క్యాసినో యాప్స్‌‌‌‌, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లను ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పంజాగుట్ట పీఎస్​ సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ ద్వారా సెలెబ్రిటీల అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌ అయిన డబ్బును మనీ లాండరింగ్‌‌‌‌ కింద పరిగణనలోకి తీసు కుని దర్యాప్తు చేస్తున్నది.