సైబర్ అలర్ట్.. అయోధ్య ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు అంటూ మోసం

సైబర్ అలర్ట్..   అయోధ్య ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు అంటూ మోసం

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో 9 రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది.  దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు.  ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు.  అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు.  

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్​కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్​ క్లిక్​ చేయండంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు.  ఇక మరికొందరైతే డైరక్ట్​గా ఈ ఏపీకే ఫైల్​ ను  డౌన్​లోడ్​ చేసుకుంటే  వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుంది అంటూ వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. అయితే తస్మాత్​ జాగ్రత్త! ఇలాంటి మెసేజ్​లోని లింక్స్​ క్లిక్​ చేసినా, ఏపీకే ఫైల్స్​ డౌన్​లోడ్​ చేసినా.. ఇక అంతే! మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.  ఈ  మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

11 రోజులు  మోదీ దీక్ష

అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించారు. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని ఆయన వెల్లడించారు. శుక్రవారం ఆయన నాసిక్​లోని కాలారామ్ టెంపుల్​లో పూజలు చేశారు. అక్కడి ఫ్లోర్​ను శుభ్రం చేశారు.