వెంకటాపురం, వెలుగు : మాన్సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అప్రమత్తంగా పనిచేయాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా ఆరోగ్య శాఖ వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఆఫీసర్లు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అనంతరం వాజేడు మండలం చీకుపల్లి సమీపంలోని ఎన్‌హెచ్-163పై ఇసక వాగు వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
