గోదావరి వరదలపై అలర్ట్గా ఉండాలి : భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ

గోదావరి వరదలపై అలర్ట్గా ఉండాలి : భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ

భద్రాచలం, వెలుగు: 2022 లో వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఇతర శాఖల ఆఫీసర్లంతా అప్రమత్తంగా ఉండాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని భద్రాచలం సబ్ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ఠ సూచించారు. బుధవారం సబ్ కలెక్టర్​ కార్యాలయంలో నిర్వహించిన గోదావరి ఫ్లడ్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గోదావరి వరదల వల్ల ముంపునకు గురయ్యే ఏజెన్సీ మండలాల్లోని గ్రామాలకు చేపట్టాల్సిన పనుల గురించి అన్ని శాఖల ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించారు.  

పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం లేకుండా సెలవులు తీసుకోకూడదని హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో బోట్లు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీంలను రెడీ చేసి పెట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కరెంట్, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో ముందుగానే మైక్​ల ద్వారా వరద పరిస్థితిని వివరించాలన్నారు. డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. మీటింగ్​లో డీఎస్పీ అరుణ్​కుమార్, ఎస్​డీసీ ఆనంద్​కుమార్, డీఎల్​పీవో సుధీర్, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.