భద్రాచలం, వెలుగు : ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని సన్నిధిలో బుధవారం భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా కాశీ క్షేత్ర ఆఫీసర్ల అభ్యర్ధన మేరకు తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని జరిపించింది. దేవస్థానం ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో స్థానాచార్యులు స్థలసాయి, అర్చకులు భద్రాచలం నుంచి స్వామిమూర్తులను తీసుకెళ్లారు.
భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి యజ్ఞపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తం,మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలను వరుస క్రమంలో నిర్వహించి చివరిగా మంత్రపుష్పం సమర్పించారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు కాశీలోని భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం భక్తులు క్యూ కట్టారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తులు తన్మయం చెందారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. సుప్రభాత సేవ అనంతరం జరిగిన ఈ అభిషేకాన్ని భక్తులు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అభిషేకం అనంతరం నిత్య కల్యాణం చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
