భద్రాచలం రామయ్యకు అభిషేకం.. బంగారు పుష్పార్చన

భద్రాచలం  రామయ్యకు అభిషేకం.. బంగారు పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెతో అభిషేకం, మంజీరాలను అద్ది స్నపన తిరుమంజనం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. 

విశేష అలంకరణలు చేసి బంగారు పుష్పాలతో అర్చన చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్యకల్యాణం చేశారు. కంకణాలు ధరించి భక్తులు కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. సీతారామయ్యకు దివిటీ సలాం అందజేశారు