భక్తులతో పోటెత్తిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం

భక్తులతో పోటెత్తిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం
  • రామయ్యకు ఘనంగా అభిషేకం, బంగారు పుష్పార్చన
  • ఎంపీ బలరాంనాయక్​ ఆలయంలో ప్రత్యేక పూజలు

భద్రాచలం, వెలుగు :  కార్తీకమాసం, ఆదివారం కావడంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. 

అనంతరం మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మంజీరాలు అద్ది స్నపన తిరుమంజనం చేసి భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి విశేష హారతులు సమర్పించారు. బంగారు పుష్పాలతో అర్చన చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేయగా 75 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం స్వామికి రాజబోగం నివేదించారు. తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. సాయంత్రం దర్బారు సేవ చేసి స్వామికి దివిటీ సలాం ఇచ్చారు. 

మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాంనాయక్​ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూజలనంతరం ఆయనకు లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చారు.