భద్రాచలంలో సెప్టెంబరు 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు...

భద్రాచలంలో సెప్టెంబరు 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు...
  • అక్టోబరు 7న  శబరి స్మృతి యాత్ర 
  • ఆశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలు షెడ్యూల్​  విడుదల 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆశ్వయుజ మాసంలో నిర్వహించే ఉత్సవాల షెడ్యూల్​ను వైదిక కమిటీ శనివారం రిలీజ్​ చేసింది. ఈ మేరకు ఈవో దామోదర్​రావు ఉత్సవాల వివరాలను  వెల్లడించారు. ఈనెల 23నుంచి అక్టోబరు 2 వరకు లక్ష్మీతాయారు అమ్మవారి ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. 

లక్ష్మీతాయారు అమ్మవారు ఈనెల 23న ఆదిలక్ష్మి, 24న సంతాన, 25న గజలక్ష్మి, 26న ధనలక్ష్మి, 27న ధాన్య, 28న విజయలక్ష్మి, 29న ఐశ్వర్యలక్ష్మి, 30న వీరలక్ష్మి, అక్టోబరు 1న మహాలక్ష్మీ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. అలంకారాల సమయంలో సామూహికంగా రోజూ బాల,అయోధ్య, అరణ్య, కిష్కింధ,సుందర, యుద్దకాండ రామాయణ పారాయణాలు నిర్వహిస్తారు. 

2న విజయదశమి, సంక్షేప రామాయణ హవనం, పూర్ణాహుతి, నిజరూప లక్ష్మి అలంకారంలో అమ్మవారికి పూజలు, సీతారాముల మహాపట్టాభిషేకం, సాయంత్రం విజయోత్సవం, శమీ పూజ, ఆయుధపూజ, దసరా మండపం వద్ద శ్రీరామలీలా మహోత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 7న పూర్ణిమ వేళ వాల్మీకీ జయంతి, శబరి స్మృతి యాత్ర జరుపుతారు. అక్టోబరు 20న దీపావళి పర్వదినం జరపాలని వైదిక కమిటీ తెలిపింది.