గోదావరి పుష్కరాల నాటికి ..భద్రాచలంఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం

గోదావరి పుష్కరాల నాటికి ..భద్రాచలంఆలయ అభివృద్ధి  పనులు పూర్తి చేస్తాం
  •     దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం : మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్‌‌‌‌/కూసుమంచి, వెలుగు : గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు గణపేశ్వరాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్‌‌‌‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గత ప్రభుత్వం రూ. 100 కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు రూ. 350 కోట్లతో శంకుస్థాపన చేశారని, మరో వారం నుంచి పది రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. 

గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ కోసం ఇప్పటికే రూ.68 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని దేవాలయాలు అభివృద్ధికి మొత్తం రూ. 1000 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే గణపేశ్వరాలయం అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

 ఆలయాలతో పాటు చర్చీలు, మసీదుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచే ప్రారంభం కానుందన్నారు. 

ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున మొత్తం 2.50 లక్షల ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేండ్లలోనే 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇరిగేషన్‌‌‌‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌ మువ్వా విజయ్‌‌‌‌బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, కూసుమంచి తహసీల్దార్‌‌‌‌ సైదులు పాల్గొన్నారు.