నా చావుకు ఎమ్మెల్యే కొడుకే కారణం

నా చావుకు ఎమ్మెల్యే కొడుకే కారణం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘నా చావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు కొడుకు వనమా రాఘవతో పాటు మరికొందరు కారణం’ అంటూ ఎస్పీ పేరిట సూసైడ్​ లెటర్​రాసి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వికలాంగ కాలనీకి చెందిన రైతు మలిపెద్ది వెంకటేశ్వర్లు(40)కు భార్య శ్రావణి, ఇద్దరు కూతుళ్లున్నారు. తమ బంధువులైన ఇందుకుమారి, భానుకుమార్, పవన్​వద్ద వెంకటేశ్వర్లు రూ. 25 లక్షల చొప్పున రెండు చిట్టీలు వేశారు. చిట్టీ పాడుకున్నా డబ్బులు ఇవ్వలేదు. గట్టిగా అడగడంతో చివరకు కొంత ల్యాండ్ ​రాసిచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు ఆ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. కాగా అదే స్థలాన్ని సత్తుపల్లికి చెందిన కానిస్టేబుల్​మల్లెల రామారావు కుటుంబసభ్యులకు కూడా భానుకుమార్, పవన్ ​అమ్మినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని ఇందుకుమారి ఇంటికి వెళ్లి అడగగా తిట్టడంతో పాటు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు కొడుకు వనమా రాఘవ సాయంతో అక్రమ కేసులు పెట్టారు. మార్చి నెలలో వెంకటేశ్వర్లును జైలుకు పంపించారు. వెంకటేశ్వర్లు జైలుకు వెళ్లిన టైంలో వనమా రాఘవ సాయంతో రేకుల షెడ్డును కూల్చివేయడంతో పాటు ల్యాండ్​ను ఆక్రమించుకున్నారు. బెయిల్​పై వచ్చిన వెంకటేశ్వర్లు విషయం తెలుసుకొని ఇందుకుమారి, పవన్, భానుకుమార్​ వద్దకు పలుసార్లు వెళ్లారు. వారు అతడిపై దాడి చేయడంతోపాటు ఎమ్మెల్యే కొడుకు తమకు అండగా ఉన్నాడంటూ బెదిరించారు. గురువారం సైతం తనకు రావాల్సిన డబ్బుల గురించి ఇందుకుమారి ఇంటికి వెళ్లి అడిగారు. అక్కడ భానుకుమార్, పవన్​కలిసి వెంకటేశ్వర్లును తిట్టడంతో పాటు కొట్టారు. మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు బజారులో పురుగుల మందు కొనుక్కొని తాగారు. ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా భార్యకు చెప్పాడు. అప్పటికే నోటి నుంచి నురుగు వస్తుండడంతో భార్య వెంటనే పాల్వంచ గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తగూడెం గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటనపై పోలీస్​ఆఫీసర్లు సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ​ఓ ప్రకటనలో డిమాండ్​ చేశారు. 

3 గంటలపాటు కంప్లైంట్ ​తీసుకోలే
సూసైడ్​ నోట్​లో ఎమ్మెల్యే కొడుకు రాఘవతో పాటు మరికొందరు కారణమంటూ రాసి ఉండడంతో పాల్వంచ పోలీసులు దాదాపు 3 గంటలపాటు కంప్లైట్​ తీసుకోలేదని మృతుడి భార్య శ్రావణి వాపోయారు. చివరకు కంప్లైట్​ తీసుకున్నా ఎటువంటి రశీదు ఇవ్వలేదన్నారు. పోస్టుమార్టం విషయంలోనూ చాలా జాగు చేశారని వాపోయారు.