బతుకమ్మ చీరలు కుటుంబానికి ఒక్కటేనట!

బతుకమ్మ చీరలు కుటుంబానికి ఒక్కటేనట!
  • అవసరం మేరకు రాని బతుకమ్మ చీరలు
  • ఒక్కొక్కటి ఇస్తూ అడ్జస్ట్​చేస్తున్న అధికారులు
  • నాకంటే నాకంటూ కుటుంబాల్లో గొడవలు
  • ఇంటింటికీ ఇస్తమన్న ముచ్చట ఉత్తదే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగుఈ సారి మంచి క్వాలిటీతో కూడిన తీరొక్క చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు నెరవేరలేదు. ప్రతి ఒక్కరికీ ఇస్తామని చెప్పినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కుటుంబానికి ఒక్క చీర మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. అవసరం మేరకు చీరలు రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. దీంతో కుటుంబాల్లో మహిళలు నాకు కావాలంటే నాకు కావాలంటూ గొడవలు పడాల్సి వస్తున్నది.  ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకావడం, చీరలు రాకపోవడంతో మహిళలు చిన్న బుచ్చుకుంటున్నారు. ఇంటికి వచ్చి పంపిణీ చేస్తామన్న వారు కౌన్సిలర్ల ఇండ్లకు పిలిపించి ఇస్తున్నారు.

రేషన్​కార్డుకు ఒక్కటే 

జిల్లాకు సుమారు 3.48లక్షల చీరలు అవసరమవుతాయని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. శనివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకాగా ఇప్పటి వరకు 2.90లక్షల చీరలే వచ్చాయి. వీటిలో దాదాపు 20వేలు గురువారమే వచ్చాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గానికి దాదాపు 94వేల కావాల్సి ఉండగా 84వేలు వచ్చాయి. కొరత ఏర్పడడంతో కలెక్టరేట్​కు కూత వేటు దూరంలోని శేషగిరినగర్ ​పంచాయతీలో డీలర్ రేషన్​కార్డుకు ఒకటి చొప్పున పంపిణీ చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో తల్లీ, కూతురు, అత్తాకోడలు ఉంటే ఇచ్చిన ఒక్క చీరను ఎవరు కట్టుకోవాలంటూ నిలదీశారు. డీలరేమో తక్కువగా చీరలు వచ్చాయి కాబట్టి కార్డుకు ఒక్కటి చొప్పున అధికారులు ఇయ్యమన్నారని, మళ్లీ వచ్చిన  తర్వాత ఇస్తామని సమాధానం చెబుతున్నాడు.

ఇంటింటికీ ఏవి సారూ…

కరోనా నేపథ్యంలో బతుకమ్మ చీరలను ఇంటిం టికీ పంపిణీ చేస్తామని కొద్దిరోజుల కిందట కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు ప్రకటించారు. కానీ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్​ కౌన్సిలర్ల ఇండ్లలోనే డిస్ట్రిబ్యూషన్​ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రేషన్​డీలర్ల ద్వారా అందజేస్తున్నారు.

ఒక్కటిచ్చి లొల్లి పెట్టిస్తున్నరు

మా ఇంటి పక్కన ముగ్గురుంటే ఒక్కరికే ఇచ్చిన్రు. మా ఇంట్లో ఇద్దరు ఉన్నా ఒక్కరికే వచ్చింది. దీంతో ఇంట్లో గొడవలు అయ్యేట్టు ఉన్నయ్. ఇంటింటికీ వచ్చి ఇస్తమని చెప్పి రేషన్​ షాపులు, కార్పొరేటర్ల ఇండ్ల కాడ పంపిణీ చేస్తున్రు. ఇంకా చాలామందికి రాలే…ఇస్తరో ఇయ్యరో.

– రత్నకుమారి, శేషగిరి నగర్​

చీరల బదులు సామాన్లు ఇస్తే బాగుండు

అందరికీ చీరలు ఇస్తమన్నరు. రంగు రంగులవి ఇస్తమని గొప్పలు చెప్పిన్రు. బార్డర్​రంగులద్ది ప్లేన్​చీరలు ఇచ్చిన్రు. మంచి పూలు, డిజైన్లతో  ఇవ్వాల్సింది. చీరలు రాకపోవడంతో చాలామంది బాధపడుతున్నరు. చీరల బదులు పప్పులు, నూనె, ఇతర సరుకులు ఇచ్చినా బాగుండు

– నాగమణి, కొత్తగూడెం

అందరికీ ఇస్తాం

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలను ఇస్తాం. ఇప్పటికే చాలా వరకు పంపిణీ చేశాం. ఇవ్వాల, రేపు కొన్ని చీరలు వచ్చేదుంది. అవి రాగానే ఎక్కడ చీరలు తక్కువ పడ్డాయో అక్కడికి పంపిస్తాం.

– మధుసూదనరాజు, డీఆర్డీఓ పీడీ