- వసతులపై అధికారులకు సీరియస్ ఆదేశాలు
ఆళ్లపల్లి, వెలుగు : మండలంలోని మార్కోడు గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టల్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. మరుగుదొడ్లకు నిరంతర నీటి సరఫరా కల్పించాలని, భవన లీకేజీ సమస్యకు తక్షణమే రిపేర్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్‌లో స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేస్తూ, విద్యార్థులకు రుచికరమైన, పోషకాహారాన్ని అందించాలని, వంట కోసం కట్టెలకు బదులు గ్యాస్ సరఫరా ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో బోర్డుపై రాయించి వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. సమయాన్ని వృథా చేయకుండా ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని విద్యార్థులకు హితబోధ చేశారు. అనంతరం మార్కోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్ పనులను పది రోజుల్లోగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
