
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటరు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్పేర్కొన్నారు. కలెక్టరేట్లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 471 పంచాయతీలలో 6,69,024 మంది ఓటర్లున్నారన్నారు. 4,168 వార్డులకు గానూ 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ నెల 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటర్లపై జాబితాలను దరఖాస్తుల రూపంలో అందజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళితో పాటు పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యోగ అవకాశాలు
జియాలజీ కోర్సులకు దేశ, విదేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలున్నాయని కలెక్టర్జితేశ్పేర్కొన్నారు. పాల్వంచలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో ఇంజనీరింగ్, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దట్టమైన అడవులు, విభిన్న వాతావరణం, నీటి వనరులు, ఖనిజాలు, మైన్స్, పలు రకాల జంతువులు ఉండడం మూలంగానే ఎర్త్ యూనివర్శిటీని ఈ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
సింగరేణి మైన్స్, కేటీపీఎస్, బీటీపీఎస్, ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి ప్రధాన పరిశ్రమలున్నాయన్నారు. జియాలజీ చదివే విద్యార్థులకు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు జిల్లా అనువుగా ఉందని తెలిపారు. భవిష్యత్లో ఈ యూనివర్శిటీ దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు.