ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సోమవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారు దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆది, సంతాన, గజ, ధన, ధాన్య, విజయలక్ష్మి, ఐశ్వర్య, వీర, మహా, నిజరూప లక్ష్మీ అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతీ రోజు శ్రీమద్రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా మహాపట్టాభిషేకం, విజయోత్సవం, శమీపూజ, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం దసరా మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో శివాజీ కోరారు.

వేదపండితులకు దర్బాసనాలు అందజేత

అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేదపండితుల కోసం దర్బాసనాలను  అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యం జరిగే శ్రీరామాయణ మహాపారాయణోత్సవాల్లో పాల్గొనే వేదపండితుల కోసం వీటిని ఇచ్చారు. స్థానాచార్యులు స్థలసాయి, వంగీపురం వంశీకృష్ణమాచార్య పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి ఆలయంలో..

పాల్వంచ: మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయం శరన్నవరాత్రులకు ముస్తాబైంది. ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. 21 మంది రుత్వికులతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో కుంకుమార్చన, రుద్రాభిషేకాలు, చండీ హోమం, రుద్ర హోమం, సప్తశతి పారాయణం పూజలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కె సులోచన, ధర్మకర్తల మండలి చైర్మన్ మహిపతి రామలింగం తెలిపారు. 

క్రికెట్‌  బెట్టింగ్‌  నిర్వాహకుల అరెస్ట్

భద్రాచలం, వెలుగు: పట్టణంలో ఆదివారం క్రికెట్‌ బెట్టింగ్‌  నిర్వహిస్తున్న ఐదుగురిని టౌన్‌ సీఐ నాగరాజురెడ్డి అదుపులోకి తీసుకున్నారు. కొర్రాజులగుట్టలోని ఒక ఇంట్లో క్రికెట్‌ బెట్టింగ్‌  నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని రూ.14,480, సెల్‌ఫోన్‌ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వెల్ఫేర్​ బోర్డ్ ఏర్పాటు చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలోని రవాణా రంగంలో పని చేస్తున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణం వెంకటేశ్వరరావు, రోడ్ ట్రాన్స్​పోర్ట్  వర్కర్స్  యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్  డిమాండ్ చేశారు. సిటీలోని మంచికంటి భవనంలో తెలంగాణ ప్రైవేట్, పబ్లిక్ రోడ్​ ట్రాన్స్​పోర్ట్  వర్కర్స్ ఫెడరేషన్  ఖమ్మం జిల్లా రెండో మహాసభ తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగింది. కనీస వేతనాలు, హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.

పండిట్​​ దీన్​దయాళ్​కు ఘన నివాళి

ఖమ్మం టౌన్/భద్రాచలం,వెలుగు: ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి రుద్ర ప్రదీప్ ఆధ్వర్యంలో ఆదివారం పండిట్​​ దీన్​దయాళ్​ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గెంటేల విద్యాసాగర్, మందా సరస్వతి, కె.ఉపేందర్, కుమిలి శ్రీనివాస్ రావు, అనంత్ ఉపేందర్ గౌడ్, చంద్రశేఖర్, నర్సింహులు, రాజిరెడ్డి, ఎల్లారావు గౌడ్  పాల్గొన్నారు. భద్రాచలంలో దీన్​దయాళ్  ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ లీడర్లు ములిశెట్టి రామ్మోహన్​రావు, నాగబాబు, మొక్కెర కోటేశ్వరీ, వెంకటేశ్వర్లు, నిఖిల్, అన్నం హరీశ్, ముత్యాల శ్రీనివాస్​ పాల్గొన్నారు.

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

కూసుమంచి, వెలుగు: కుటుంబ కలహాలతో పిల్లలతో సహా ఓ తల్లి పాలేరు జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. జాలరి ఉప్పయ్య కథనం మేరకు.. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన షేక్​ నూర్జహాన్(30)కు నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన షేక్​ నబీబ్​ పాషాతో వివాహం జరిగింది. నబీబ్​పాషా తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం మరోసారి గొడవ కావడంతో మనస్థాపం చెంది ఆదివారం నూర్జహాన్​ తన పిల్లలు నస్రుద్దీన్​బాబా(8) నస్రిద్దీన్​బాబా(6) తీసుకొని పాలేరు చెరువు దగ్గరకు వచ్చింది. కేజ్​ కల్చర్​ యూనిట్​ వద్ద పిల్లలతో సహా చెరువులో దూకేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న జాలరి బత్తుల ఉప్పయ్య వారిని గట్టిగా పట్టుకొని స్థానికుల సహకారంతో పోలీసులు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్​ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలి

కల్లూరు, వెలుగు: క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కల్లూరులోని గురుకుల బాలికల కాలేజ్​ గ్రౌండ్​లో ఆదివారం 8వ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్  స్పోర్ట్స్ మీట్ న్యూ జోనల్ ఫోర్త్(బి) స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజుతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్  మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. జిల్లాలోని 14 రెసిడెన్షియల్  స్కూల్స్​కు చెందిన 1190 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ఆర్సీవో కె ప్రత్యూష తెలిపారు. ప్రిన్సిపాల్  కె శ్రీలత, ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, తహసీల్దార్​ బాబ్జి ప్రసాద్, ప్రిన్సిపాల్  కె శ్రీలత, ఏఎంసీ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పాల్వంచలో..

పాల్వంచలోని గురుకులాల 8వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటే శ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్  కెవెంకటేశ్వర్లు, డీసీఎంఎస్  వైస్  చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపాటి వాసుదేవ రావు, ఎంపీపీ ఎం సరస్వ తి, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్  విజయ్ కుమార్  పాల్గొన్నారు. 

పీసీసీ సభ్యులకు సన్మానం

ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు: పీసీసీ డెలిగేట్ గా నియమితుడైన జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రాన్ని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పార్టీ నాయకులు బాణాల లక్ష్మణ్, పర్లపాటి కృష్ణ, బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, భారతి చంద్రం పాల్గొన్నారు.

ఎడవల్లి కృష్ణకు సన్మానం 

పాల్వంచ: టీపీసీసీ సభ్యుడిగా రెండోసారి నియమితులైన ఎడవల్లి కృష్ణను ఆదివారం ఆయన నివాసంలో సన్మానించారు. రేవంత్ యువసేన జిల్లా కన్వీనర్ వానపాకుల రాంబాబు శాలువా, పూలమాలతో సత్కరించారు. నూకల రంగారావు, పైడిపల్లి మనోహర్, చాంద్ పాషా, బద్ది కిశోర్, కొండం వెంకన్న, సీహెచ్  సత్యనారాయణ, రాము నాయక్, జట్టి శ్రీనివాస్  పాల్గొన్నారు. 

నేడు దిశ కమిటీ సమావేశం

ఖమ్మం టౌన్, వెలుగు: దిశ కమిటీ సమావేశాన్ని నేడు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన డీపీఆర్సీ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్  తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేఎంసీ మేయర్  పూనుకోలు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ప్రజా ప్రతినిధులు, దిశ కమిటీ నామినేటెడ్  సభ్యులు హాజరు కానున్నట్లు చెప్పారు.

రేషన్ బియ్యం పట్టివేత

అశ్వారావుపేట, వెలుగు: రెండు లారీల్లో తరలిస్తున్న 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అరుణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి నుంచి కాకినాడకు రెండు లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా, రింగ్​ రోడ్డు సెంటర్ వద్ద తనిఖీ చేయగా బియ్యం బస్తాలు పట్టుబడినట్లు చెప్పారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకొని లారీలను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మెరిట్ స్కాలర్​షిప్ అందజేత

ములకలపల్లి,వెలుగు: మండల కేంద్రంలోని సోషల్  వెల్ఫేర్  కాలేజీలో చదివిన కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన భుక్యా అపర్ణ జేఈఈ మెయిన్స్​లో 97,120 మార్కులతో 157వ ర్యాంకు ఆలిండియా స్థాయిలో సాధించింది. వరంగల్  నిట్​లో ఈసీఈ సీటు దక్కించుకున్న ఆమెకు టీఎస్ఆర్  ట్రస్ట్​  కోఆర్డినేటర్ నడిపల్లి నవీన్ కుమార్  రూ.10 వేల నగదును మెరిట్ స్కాలర్​షిప్  కింద అందజేశారు. నరాటి ప్రసాద్, శ్రీను  పాల్గొన్నారు. 

26న స్పాట్ అడ్మిషన్లు

ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని టీఎస్ డబ్ల్యూ ఆర్డీసీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి ఝాన్సీరాణి తెలిపారు. బీఎస్సీ ఎంపీసీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లు మిగిలినట్లు చెప్పారు. ఇంటర్​ పాసైన విద్యార్థినులు ఈ నెల 26న ఉదయం10 గంటల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే రోజు స్పాట్ అడ్మిషన్లు చేపడతామని తెలిపారు. 

గాయకుడు బాలుకు నివాళి

భద్రాచలం, వెలుగు: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని ఆదివారం భద్రాద్రి స్వరాంజలి, భద్రాద్రి మెలోడీ సింగర్స్ గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నపూర్ణ ఫంక్షన్​హాలులో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాలు పాడిన పాటలతో స్వర నీరాజనం చేశారు. రోటరీ గవర్నర్​ బూసిరెడ్డి శంకర్​రెడ్డి, ఎండీ సాదిక్​పాషా, పోకల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రైవేట్  హాస్పిటల్స్​కు నోటీసులు

మణుగూరు, వెలుగు: మండలంలోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 ప్రైవేట్  హాస్పిటల్స్ కు షోకాజ్  నోటీసులు జారీ చేసినట్లు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్  శ్రీనివాస్  తెలిపారు. మండలంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో క్వాలిటీ సర్టిఫికెట్స్, సిబ్బంది, పర్మిషన్స్  పరిశీలించినట్లు చెప్పారు. రూల్స్​ పాటించని 14 హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు రెండు ప్రైవేటు ల్యాబ్ లను సీజ్ చేశామని తెలిపారు. డిప్యూటీ డీఈఎంవో ఫయాజుద్దీన్, అసిస్టెంట్​ డీఎంవో గొంది వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్  పాల్గొన్నారు.