జగన్మోహిని అలంకారంలో భద్రాద్రి రామయ్య

జగన్మోహిని అలంకారంలో  భద్రాద్రి రామయ్య
  • ఘనంగా అభిషేకం...బంగారు పుష్పార్చన
  • చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు

భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి)ని పురస్కరించుకుని ఆదివారం భద్రాచలంలో సీతారామచంద్రస్వామి జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. జగన్మోహిని అలంకారంలో అందంగా అలంకరించి మేళతాళాలతో నిత్య కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో దేవస్థానం ఆస్థాన విద్వాంసులు భక్తరామదాసు, తూము లక్ష్మీనర్సింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అందుకు అనుగుణంగా ప్రత్యేక హారతులను సమర్పించారు. 

రాజాధిరాజ వాహనంపై స్వామి వారు జగన్మోహిని అలంకారంలో తిరువీధి సేవగా వెళ్లగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో దామోదర్​రావు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు సుప్రభాత సేవ చేసి, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో రామదాసు కీర్తలను ఆలపిస్తూ సువర్ణ పుష్పార్చన వేదోక్తంగా జరిపించారు. నిత్యకల్యాణం జరిగింది. చిత్రకూట మండపంలో కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో పోటెత్తాయి.