
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆస్పిరేషన్ జిల్లా నుంచి దేశానికే ఇన్సిపిరేషన్ అందించే జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆస్పిరేషన్ జిల్లాగా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ కలిసి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో అనేక రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఉద్యోగి సమర్థవంతంగా పనిచేయడంతోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతీ అంగన్వాడీ సెంటర్, స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామ నితెలిపారు. ఆకాంక్షిత అభివృద్ధి లక్ష్యాల్లో విశేష కృషి చేసిన పలువురు జిల్లా అధికారులతో పాటు మొత్తం 133 మందికి మెడల్స్, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.
నులిపురుగుల దినోత్సవాన్ని సకెస్స్ చేయాలి
ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని కలెక్టర్ జితేశ్పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు గల వారందరికీ నులి పురుగులను నివారించే అల్బెండజోల్ మాత్రలను వేయనున్నట్టు తెలిపారు.
ఈ మాత్రలు వేసుకోవడం వల్ల స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉంటారని, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. 11న మాత్రలు వేసుకోని వారికి 18న వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో జయలక్ష్మి, సీపీఓ సంజీవరావు, ఐసీడీఎస్ పీడీ స్వర్ణలత లెనినా, డాకర్లు తేజశ్రీ, స్పందన, మధురం, భూపాల్‌రెడ్డి, డిప్యూటీ డెమో ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.