భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నీటి మట్టం 54.3 అడుగులకు చేరుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రామాలయం దగ్గర బ్యాక్ వాటర్ రావడంతో ఆ ప్రాంత ప్రజలు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. హెవీ మోటార్ల ద్వారా వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి దగ్గర ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం 54.3 అడుగుల నీటి మట్టం ఉంది. మరో అడుగు మేర వరద ప్రవాహం తగ్గితే మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకోనున్నారు.
మరోవైపు గోదావరి కరకట్ట స్లుయిజ్ లీక్ అవడంతో చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ పెట్టారు. కరకట్ట మీదకు ఎవరు వెళ్లకుండా చూస్తున్నారు. పది రోజుల పాటు కురిసిన వర్షాలకు గోదావరికి భారీగా వరద ఉధృతి పెరిగింది. అయితే గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ కొన్ని కాలనీలు నీట మునిగే ఉన్నాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లలన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో కొన్ని కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి పలు NGOలు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. నీట మునిగిన ఇళ్లను చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
