శిశు మరణాలను అరికట్టడం అందరి బాధ్యత : కలెక్టర్ జితేశ్

శిశు మరణాలను అరికట్టడం అందరి బాధ్యత :  కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : శిశు మరణాలను అరికట్టడం అందరి బాధ్యత అని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ అన్నారు. కలెక్టరేట్​లో మంగళవారం నిర్వహించిన శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాదిలో జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఏడు శిశు మరణాలపై రివ్యూ చేశారు. భవిష్యత్​లో శిశు మరణాలు జరగకుండా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలన్నారు. తల్లిపాల ఆవశ్యకతపై బాలింతలతో పాటు మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 

గర్భిణుల ఇండ్లను ఏఎన్​ఎంలు, ఆశా కార్యకర్తలు సందర్శించాలన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో నిమోనియాపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం టీబీ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్​ సౌరబ్​ శర్మ, డీఎంహెచ్​ఓ జయలక్ష్మి, ఐసీడీఎస్​ పీడీ స్వర్ణలత లెనినా పాల్గొన్నారు. 

ఎర్త్​ సైన్సెస్ ​యూనివర్సిటీలో సౌకర్యాలు కల్పించాలి

పాల్వంచలోని డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ ఎర్త్​ సైన్సెస్​యూనివర్శిటీలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు. యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం అవుతున్నందుకు స్టూడెంట్స్​కు హాస్టల్​లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. యూనివర్సిటీ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రోగ్రాంలో మైనింగ్​ కాలేజీ ప్రిన్సిపాల్​ జగన్మోహన్​ రాజు, కార్పొరేషన్​ కమిషనర్​ సుజాత పాల్గొన్నారు. 

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు

మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కాగా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ జితేశ్, ఎస్పీ బి.రోహిత్​ రాజు అన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్​ కంట్రలో కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గంజాయి వినియోగంతో పాటు అమ్మకాలు, సాగుపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని డీ అడిక్షన్​ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్​ ఇప్పించేలా చూడాలన్నారు. జిల్లాలోని హాస్పటల్స్​, మెడికల్​ షాప్స్​లను ప్రతినెలా తనిఖీ చేయాలని డ్రగ్​ ఇన్స్​పెక్టర్​ను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఇంటర్మీడియట్​ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్​ఓ జయలక్ష్మి, ఆర్టీఓ వెంకటరమణ, డీఏఓ బాబూరావు పాల్గొన్నారు. 

వ్యర్థాలు ఉపయోగపడేలా చేయాలి.. 

పాల్వంచ : పాఠశాలల్లో వ్యర్థపదార్థాలను ఉపయోగపడేలా చేయాలని కలెక్టర్ జితేశ్​ టీచర్లకు సూచించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్​లో కొనసాగుతున్న  అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి డైనింగ్ హా ల్, వసతి గృహాల వరకు సులువుగా, సురక్షితంగా నడిచేందుకు అనువుగా పాత్ వే నిర్మాణాన్ని చేపట్టాలని సివిల్ అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకరంగా  నీడనిచ్చే మొక్కలతో పాటు వెదురు, పండ్లు, ఔషధ మొక్కలు నాటేలా చూడాలన్నారు.