- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
చండ్రుగొండ, వెలుగు : కాకతీయులు నిర్మించిన ప్రాచీన దేవాలయాలను రాబోయే తరాలకు అందిచేందుకు వాటి సంరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో గల కనకగిరి గుట్టలపై బుధవారం స్థానిక ఆదివాసీ గిరిజనుల తో కలిసి ఆయన సందడి చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుట్ట పై ఉన్న హస్తాల వీరన్న స్వామి, సమ్మక్క సారక్క, వీరభద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుట్టలపై ఉన్న ప్రాచీన దేవాలయాల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దేలా ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. గుట్టలు ఎక్కే సమయంలో కాకతీయులు నిర్మించిన పలు ప్రాకారాలు, ప్రాచీన దేవాలయాల చరిత్రల ను ఆదివాసీ గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గుట్టల దిగువన ఆదివాసీలు వెదురు తో తయారు చేస్తున్న బ్యాంబో క్లస్టర్ ను సందర్శించి వారిని అభినందించారు. కలెక్టర్ వెంట ట్రైనింగ్ కలెక్టర్ సౌరభ్ శర్మ, డిప్యూటీ కలెక్టర్ మురళి, దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేశ్, గ్రామస్తులు నాగ, వెంకటేశ్, నాగేంద్రబాబు, రవీందర్ రెడ్డి ఉన్నారు.
