అభివృద్ధి పనుల పురోగతిపై ప్రణాళికలు సిద్ధం చేయాలి : ప్రియాంక అల

అభివృద్ధి పనుల పురోగతిపై ప్రణాళికలు సిద్ధం చేయాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో జరుగుతున్న డెవలప్​మెంట్​ వర్క్స్​పై ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 11న  భద్రాచలంలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన సందర్భంగా ఎస్పీ బి. రోహిత్​ రాజు, ఐటీడీఏ పీఓ ప్రతీక్​ జైన్​ తో కలిసి పలు శాఖల అధికారులతో మంగళవారం రివ్యూ నిర్వహించారు. సీఎం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారన్నారు. 

అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్​ గిరిజన భవన్​లో ఉంటుందన్నారు. లక్ష్మీపురం వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలననారు. హెలీప్యాడ్​ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. అగ్నిమాపక దళం అందుబాటులో సిద్ధంగా ఉండాలన్నారు. ధరణి, ఎల్​ఆర్​ఎస్​ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలతో  నివేదికలను సిద్దం చేయాలని చెప్పారు. రామాలయం పరిధిలోని భూముల వివరాలు, టెంపుల్​ డెవలప్​మెంట్​ కోసం చేపట్టవల్సిన పనులపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ సిద్ధం చేయాలని సూచించారు. 

బుధవారం సాయంత్రం లోగా అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులపై నివేధికలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు పోడు భూముల పట్టాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పారు. శ్రీరామ నవమి నాటికి భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో వంతెన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నేషనల్​ హైవే అధికారులను ఆదేశించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్​ యాక్షన్​  ప్లాన్​ రెడీ చేయాలని చెప్పారు. ప్రోగ్రాంలో డీఆర్​డీఓ విద్యాచందన, డీఆర్​ఓ రవీంద్రనాథ్​, కలెక్టరేట్​ఏఓ గన్యాతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మున్సిపాలిటీలలో బడ్జెట్​ రూపొందించాలి

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో వార్షిక బడ్జెట్​ రూపొందించాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల మున్సిపల్​ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో మున్సిపల్​ కమిషనర్లు, మున్సిపల్​ చైర్మన్లు, పట్టణ ప్రగతి స్పెషల్​ ఆఫీసర్లు, డీఈతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుంటూ పొరపాట్లు లేకుండా వాస్తవ బడ్జెట్​ను రూపొందించాలన్నారు. 

గతేడాది డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలకు కేటాయించిన ఫండ్స్, ఖర్చు వివరాల నివేదికలను అందజేయాలన్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదని చెప్పారు. ఫుట్​పాత్​లపై ఆక్రమణలను తొలగించాలన్నారు.  ప్రతి మున్సిపాలిటీలో గ్యాస్​ ఆధారిత దహన వాటికలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో చర్చించిన అంశాలపై యాక్షన్​ టేకెన్​ రిపోర్టులను తయారు చేయాలన్నారు.