భద్రకాళి ని వదలని మురికిశాపం!.. రూ.వంద కోట్లతో చెరువు పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం

భద్రకాళి ని వదలని  మురికిశాపం!..  రూ.వంద కోట్లతో చెరువు పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం
  • ఇప్పటికే డీసిల్టేషన్ దాదాపుగా పూర్తి, చెరువులో 9 ఐ ల్యాండ్స్ ఏర్పాటుకు చర్యలు
  • పైనుంచి వచ్చే వరద, మురుగునీటితో కట్టకు గండి
  • నేరుగా భద్రకాళి చెరువులోకి చేరుతున్న డ్రైనేజీ వాటర్

హనుమకొండ, వెలుగు: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఓరుగల్లు భద్రకాళి ఆలయ చెరువును మురుగుశాపం వదలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లకుపైగా నిధులు కేటాయించి గుడి డెవలప్మెంట్ తోపాటు చెరువు శుద్ధీకరణ, బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నా, ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా భద్రకాళి లేక్ మురికికూపంగా మారుతున్నది. 

పైనుంచి వచ్చే వరద, చుట్టుపక్కల ఏరియాల మురుగునీళ్లను అదే చెరువులోకి మళ్లిస్తుండటంతో అధ్వానంగా మారుతోంది. త్వరలోనే దసరా ఉత్సవాలు ప్రారంభం కానుండటం, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు తీర్థ చక్రస్నానాలు, తెప్పోత్సవాలు నిర్వహించే చెరువు మురుగుతో నింపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రూ.వంద కోట్లతో అభివృద్ధి..

కాకతీయుల కాలంలో నిర్మించిన భద్రకాళి ఆలయాన్ని ఆనుకుని సుమారు 382 ఎకరాల్లో చెరువును ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ చెరువే ఓరుగల్లు ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చింది. కాలక్రమేనా చెరువు నిర్లక్ష్యానికి గురికావడంతో తుంగ పెరిగి, మురుగునీరు చేరి అధ్వానంగా మారింది. గత ప్రభుత్వం ఈ చెరువును పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.వంద కోట్లతో డెవలప్మెంట్ కు ప్రణాళికలు రచించింది. 

రూ.30 కోట్లతో ఆలయం చుట్టూ మాడ వీధులు, మధురై తరహాలో రాజగోపురాల నిర్మాణం, రూ.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత, రూ.13.5 కోట్లతో చెరువులో లైటింగ్, సుమారు రూ.60 కోట్లతో గ్లాస్ బ్రిడ్జి, కేబుల్ కార్, రోప్ వే, చెరువు మధ్యలో 9 ఐల్యాండ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.  పూడికతీత, ఐల్యాండ్స్ ఏర్పాటు చివరి దశకు చేరుకోగా, మిగతా పనులకు అడుగులు పడుతున్నాయి. అవి పూర్తయితే చెరువు శుద్ధీకరణ పూర్తి కావడం, సుందరంగా మారే అవకాశం ఉంది. 

గండితో చెరువులోకి మురుగు..

రూ.వంద కోట్లకుపైగా నిధులు వెచ్చించి భద్రకాళి చెరువును డెవలప్ చేస్తుండగా, పైనుంచి వచ్చే వరద, మురుగునీటితో సమస్యలు ఏర్పడుతున్నాయి. బొందివాగు చుట్టుపక్కల కాలనీలతో పాటు హంటర్ రోడ్డు, జూపార్కు, ఆపై కాలనీల నుంచి వచ్చే నీళ్లను భద్రకాళి నాలాలోకి మళ్లించాల్సి ఉంది. కానీ, ఆ దిశగా ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలు పడినప్పుడల్లా వరద ఇండ్ల మధ్య నిలిచి ఉంటుంది. కొద్ది రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద, మురుగును మళ్లించేందుకు ఆఫీసర్లు భద్రకాళి చెరువు కట్టకు అరూరి రమేశ్ క్యాంప్ ఆఫీస్ వైపు ఓ చోట గండి కొట్టారు. వరద తగ్గిన తర్వాత ఆ గండిని పూడ్చాల్సి ఉన్నా, అలాగే వదిలేశారు.

దీంతో వరద, మురుగునీటి తాకిడికి గండి కాస్త పెద్దదిగా మారి, పైనుంచి వచ్చే మురుగునీళ్లన్నీ భద్రకాళి చెరువులోకి చేరుతున్నాయి. ఇంకో రెండు చోట్ల కూడా గుర్తు తెలియని వ్యక్తులు గండిపెట్టగా, మురుగునీళ్లన్నీ నేరుగా భద్రకాళిలోకే వెళ్తున్నాయి. కొన్ని నెలలుగా ఇదే జరుగుతున్నా, ఆఫీసర్లు కనీసం అటు వైపు చూడకపోవడం గమనార్హం.

సుందరీకరణకు ముందే కంపు..

మురుగు, వరద నీటిని భద్రకాళి నాలా వైపు మళ్లించేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భద్రకాళి చెరువు మళ్లీ మురుగుమయంగా మారుతోంది. ఆఫీసర్లు కొట్టిన గండిని పూడ్చకపోవడం, జయ ఫార్మసీ కాలేజీ వైపు ఉన్న కాలనీల వాసులు మురుగు కూడా ఇందులోకే వదులుతుండటంతో చెరువు మళ్లీ కలుషితమవుతోంది. 

ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో భద్రకాళి ఆలయం, చెరువును డెవలప్ చేస్తుండగా, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చెరువు మళ్లీ మురుగుతో నిండుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి భద్రకాళి చెరువు మురికి కూపంగా మారకుండా చర్యలు తీసుకోవాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.