భద్రకాళి మాడవీధులపై.. రాజకీయం.. ఎమ్మెల్యే నాయిని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం

భద్రకాళి మాడవీధులపై.. రాజకీయం..  ఎమ్మెల్యే నాయిని వర్సెస్  మాజీ ఎమ్మెల్యే దాస్యం
  • పనుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్
  • మాడవీధుల కోసం పేదల గుడిసెలు కూల్చితే ఊరుకోమన్న దాస్యం
  • వాటిని కూల్చాలని మినిట్స్ బుక్​లో చేర్చిందే వినయ్ భాస్కర్ అంటున్న నాయిని

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం రాజకీయ రంగు పులుముకుంటోంది. భద్రకాళి ఆలయాభివృద్ధిలో భాగంగా ఆలయం చుట్టూరా అమ్మవారి రథయాత్ర చేపట్టేందుకు వీలుగా మాడవీధుల పనులకు బీఆర్‍ఎస్‍ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍ భాస్కర్‍ అడ్డుపడుతున్నాడని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి మండిపడుతున్నారు. అమాయక పేదలను అడ్డుపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, నాయిని రాజేందర్‍రెడ్డి మాడవీధుల నిర్మాణం పేరుతో పేదల గుడిసెలను కూల్చివేయాలని చూస్తున్నాడని.. ఎట్టిపరిస్థితుల్లో దానిని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్‍ అంటున్నారు. మాడవీధుల నిర్మాణంలో అడ్డుగా ఉన్న ఇండ్లను తొలగించాలని 2022, 2023లో బీఆర్‍ఎస్‍ హయాంలో ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్‍, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి.. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మినిట్స్  కాపీని ఎమ్మెల్యే నాయిని బయటపెట్టారు. వినయ్‍ భాస్కర్‍ డబుల్‍ గేమ్‍ ఆడుతున్నాడన్నారు. గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు లేకున్నా వారికి ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు. 

2022లో మాడవీధుల మాటచెప్పి..

బీఆర్ఎస్  హయాంలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న దాస్యం వినయ్‍భాస్కర్‍ 2022లో భద్రకాళి ఆలయానికి మాడవీధులు నిర్మిస్తామని చెప్పారు. రూ.30 కోట్ల నిధులతో 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. కొబ్బరికాయలు కొట్టారు. తీరాచూస్తే చెప్పిన గడువు ముగిసింది తప్పితే పనులు చేపట్టలేదు. నిధులు విడుదల చేయలేదు. ఆ తర్వాత 2023 దసరా నాటికి పూర్తి చేస్తామని చెప్పినా చేతల్లో చూపలేకపోయారు. అదే ఏడాది చివర్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్‍ భాస్కర్‍
 ఓడిపోయారు. 

రూ.30 కోట్లతో పనులు ప్రారంభం.. 

ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి భద్రకాళి ఆలయ మాడవీధుల పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆలయం చుట్టూరా అమ్మవారి రథం తిరిగేలా దారులు నిర్మించే క్రమంలో చెరువు వైపు భాగంలో రోడ్డు నిర్మించారు. వేద పాఠశాల వైపు ఉండే భారీ లోయను పూడ్చివేశారు. గుట్టను ఆనుకుని ఉండే కొందరు పేదల గుడిసెల మీదుగా మాడవీధుల దారిని క్లియర్‍ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తమకు అన్యాయం చేయొద్దని స్థానికులు కోరుతుండగా.. వంద శాతం ప్రత్యామ్నాయం చూపి ఆదుకుంటామని ఎమ్మెల్యే నాయిని అంటుండగా, మాడవీధుల పేరుతో గుడిసెల జోలికొస్తే ఊరుకోమని బీఆర్‍ఎస్‍ నేత దాస్యం వినయ్‍ భాస్కర్‍ కార్యక్రమం చేపట్టడంతో ఆలయాభివృద్ధి రాజకీయమవుతోంది. 

దీనిపై భక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడవీధుల నిర్మాణం, రాజగోపురాలతో ఓరుగల్లు భద్రకాళి ఆలయానికి గుర్తింపు వస్తుందని..ఈ క్రమంలో దీనిపై  రాజకీయమేంటని సీరియస్  అవుతున్నారు. నిర్మాణం చేపట్టే క్రమంలో ఏండ్ల తరబడి గుడిసెల్లో ఉంటున్న బాధిత పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అంటున్నారు. అదేసమయంలో.. ఆలయాభివృద్ధికి సంబంధించిన ఇష్యూలో బీఆర్‍ఎస్‍ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇవే ఇండ్లను కూల్చాలని అధికారులను ఆదేశించిన నేతలు ఇప్పుడు.. మొసలి కన్నీరు కారుస్తూ బాధితుల పక్షాన ఉంటామని డబుల్‍ గేమ్‍ ఆడటాన్ని తప్పుపడుతున్నారు.

ఆదుకుంటుంటే అడ్డు పడ్తుండు 

భద్రకాళి మాడవీధుల నిర్మాణానికి అవసరమైన రూ.30 కోట్ల నిధులు ఇప్పించినం. రెండు వైపులా పనులు చేపట్టినం. మరోవైపు ఇండ్ల పట్టాలు లేని పేదల గుడిసెలు ఉన్న క్రమంలో వారికి మరోచోట ఇండ్లు, ఉపాధి కల్పించడం ద్వారా ఆదుకోవాలని చూస్తున్నాం. కానీ, మాడవీధుల నిర్మాణం జరిగితే తనకు మంచిపేరు వస్తుందని దాస్యం వినయ్‍ భాస్కర్‍ పేదలను ముందు పెట్టి అడ్డుపడుతున్నాడు. ఇవే ఇండ్లను కూల్చాలని 2022, 2023లో ఇదే వినయ్‍ భాస్కర్‍ అప్పటి కలెక్టర్‍ రాజీవ్‍గాంధీ హనుమంతు, అధికారులను ఆదేశించాడు. ఇప్పుడు మళ్లీ అతనే డబుల్‍ గేమ్‍ ఆడుతున్నాడు. వినయ్‍ భాస్కర్‍కు ప్రజలే బుద్ధిచెప్పాలే. - నాయిని రాజేందర్‍రెడ్డి, ఎమ్మెల్యే

గుడిసెవాసులకు అండగా ఉంటం

భద్రకాళి ఆలయాన్ని ఆనుకుని ఉన్న చెరబండ రాజు కాలనీలోని గుడిసెవాసులకు అండగా ఉంటం. మాడవీధుల నిర్మాణం పేరుతో వారి ఇండ్లకు కరెంట్‍, నీళ్లు కట్‍ చేపిస్తున్నారు. గుడిసెలు కూల్చుతామని బెదిరిస్తున్నారు. పేదల ఇండ్లు కూల్చకుండా వారికి ఇక్కడే ఇండ్ల పట్టాలియ్యాలే. బీఆర్‍ఎస్‍ లీగల్‍ సెల్‍ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‍ చైర్మన్‍ను కలిసింది. పేదల పక్షాన పోరాడుతాం.- దాస్యం వినయ్‍ భాస్కర్‍