వరంగల్‍ భద్రకాళి టెంపుల్‍ కేంద్రంగా.. టూరిజం సర్క్యూట్.. GWMC ఆఫీస్‍ స్థలంలో బడా మల్టీప్లెక్స్

వరంగల్‍ భద్రకాళి టెంపుల్‍ కేంద్రంగా.. టూరిజం సర్క్యూట్.. GWMC ఆఫీస్‍ స్థలంలో బడా మల్టీప్లెక్స్
  • మాడవీధులు, రాజగోపురాలతో ఆధ్యాత్మిక క్షేత్రంగా అమ్మవారి ఆలయం
  • ఆలయానికి ఒకవైపు భద్రకాళి బండ్‍
  • చెరువుపై అద్దాల వంతెన, ఐలాండ్స్, రోప్‍వే 
  • ఆహ్లాదానికి మ్యూజికల్‍ గార్డెన్‍, ప్లానెటోరియం 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍లోని భద్రకాళి టెంపుల్‍ టూరిజం సర్క్యూట్‍గా మారబోతోంది. హనుమకొండ, వరంగల్‍ నగరాల సెంటర్‍గా ఉండే ఈ ఆలయానికి కిలోమీటర్‍ దూరంలోనే ఆరేడు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే భక్తులు, కుటుంబ సభ్యులు, యూత్‍, పిల్లలు ఇలా అన్నితరహా పర్యాటకులను ఆకట్టునే ప్రాంతంగా భద్రకాళి టెంపుల్‍ సెంటర్‍ ఆఫ్‍ ది అట్రాక్షన్‍ అవనుంది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులు రోజు మొత్తం ప్రకృతి ఒడిలో సేద తీరేలా మిగతా ప్లేసులు ఆలరించనున్నాయి.

భక్తి, ప్రకృతి కేంద్రంగా..

ఓరుగల్లు భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయాల్లో 800 ఏండ్లనాటి ఆలయం చుట్టూరా అమ్మవారి రథయాత్ర చేపట్టేలా మాడవీధుల నిర్మాణం జరుగుతోంది. రూ.30–55 కోట్లతో ఈ పనుల కోసం ఏకంగా మూడు వైపులా అడ్డుగా ఉన్న చెరువు, కొండ, లోయను సరిచేశారు. నాలుగు వైపులా మదురై మీనాక్షి ఆలయం మాదిరి రాజగోపురాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.100 కోట్లతో చేపట్టిన భద్రకాళి బండ్‍ నగరానికి ఐకాన్‍గా ఉంది. మరో రూ.75 కోట్లతో మధ్యలో ఉన్న భద్రకాళి చెరువులో బోటు షికారు, నీటిపై నడిచేలా అద్దలా వంతెన, నీటి మధ్యలో 9 ఐలాండ్ల నిర్మాణ పనులకు అడుగులు పడ్డాయి. ఇవేగాక ఆలయానికి వెనకాల వైపు పద్మాక్షి గుట్టను కలిపేలా చెరువు పైనుంచి రోప్‍వే నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు.

మ్యూజికల్‍, ప్లానెటోరియంతో కొత్త కళ..

భద్రకాళి ఆలయానికి వెళ్లే దారి మొదట్లోనే మ్యూజికల్‍ గార్డెన్‍, ప్లానెటోరియం పిల్లలతోపాటు ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్లాదపర్చనుంది. భద్రకాళి చెరువు కట్టను ఆనుకుని నిర్మించిన మ్యూజికల్‍ దాదాపు 30 ఏండ్ల కిందనే నగరానికి అందాన్ని తెచ్చిపెట్టగా, ఆపై పాలకులు పట్టించుకోకపోవడంతో మూలకుపడింది. ఇప్పుడు దాదాపు రూ.4 కోట్లతో దీనిని అభివృద్ధి చేశారు. పాటలు, మ్యూజిక్‍కు అనుగుణంగా వాటర్‍ డాన్స్​ చేసే ఫౌంటెయిన్లు నిర్మించారు. గ్రీనరీ వర్క్​ చివకి దశకు రాగా, ఓపెనింగ్‍కు సిద్ధమైంది. 

గార్డెన్ గోడను 1984 లోనే స్కూల్‍ పిల్లల మేథస్సు పెంచేలా రాష్ట్రంలో రెండో పెద్దదైన ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూతపడగా, ఇప్పుడు సుమారు రూ.6 కోట్లతో అత్యాధునిక డిజిటల్‍ ప్లానెటోరియంగా డెవలప్‍ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది స్కూల్‍ పిల్లలకు ఖగోళ, సైన్స్​ పాఠాలు నేర్పే టూరిజం స్పాట్‍ అవనుంది. దీనిని ఆనుకుని ఇండోర్‍ స్పోర్ట్స్​స్టేడియం ఉండటంతో యూత్‍ను ఆకట్టుకోనుంది.

బల్దియా ఖాళీ స్థలంలో బడా మల్టీప్లెక్స్​

భద్రకాళి టెంపుల్‍ సెంటర్‍గా టూరిజం డెవలప్‍ అవుతున్న క్రమంలో ఆలయానికి వెళ్లే దారికి అడుగుదూరంలో ప్రస్తుతం ఉన్న జీడబ్ల్యూఎంసీ ఆఫీస్‍ ఖాళీ స్థలంలో భారీ మల్టీప్లెక్స్​ నిర్మించడం ద్వారా ఈ ప్రాంతానికి గ్రాండ్‍ లుక్‍ తీసుకొచ్చే ఆలోచనలో జిల్లా పాలకులు, గ్రేటర్‍ అధికారులు ఉన్నారు. మ్యూజికల్‍ గార్డెన్‍ ప్రధాన గేటు ముందట గతంలో ఆఫీస్‍ నిర్మాణానికి తీసి ఆపేసిన పెద్ద ఖాళీ స్థలంలో నిర్మించే మల్టీప్లెక్స్​లో సినిమా థియేటర్లు, గేమింగ్‍ జోన్‍, బ్రాండెడ్‍ షాపింగ్‍ మాల్స్, ఫుడ్‍ కోర్ట్స్, రెస్టారెండ్లు ఉండేలా చూడటం ద్వారా పర్యాటకులకు కేవలం కిలోమీటర్‍ దూరంలోనే ఆధ్యాత్మికం, పర్యాటకం ఉండేలా భద్రకాళి టెంపుల్‍ టూరిజం సర్క్యూట్‍గా మారనుంది.