తన ఆత్మ బలిదానంతో భారత స్వాతంత్య్ర చరిత్ర గమనానికి ఒక దిక్సూచిలా వెలిగిన అమరజీవి. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ స్వరాజ్యం కోసం నినదించి, 23 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పాడు. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తి నింపాయి. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన భగత్‌సింగ్, జీవిత పోరాటాలకు మరో రూపమే ఈ పుస్తకం. భగత్ సింగ్ జీవితంపై ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. కానీ ఇది కాస్త విభిన్నం. ఇది అనువాదమే అయినా.. రచనలో స్పష్టత ఉంటుంది.
భగత్ సింగ్ లక్ష్యం కేవలం రాజకీయ విప్లవం మాత్రమే కాదు. వేల ఏండ్లుగా కొనసాగుతున్న సామాజిక వివక్ష అంతం కూడా. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను ఆయన ముందుగానే ఆలోచించి, అధ్యయనం చేయడంలో చూపిన దార్శనికత ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఆయన కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలపై రాజకీయ, సామాజిక దృష్టితో చాలా రచనలు చేశారు. కులం, మతం, భాష, రాజకీయాలు వంటి పలు అంశాలపై ఇవి ఉండేవి. జైలులో సైతం ఆయన అధ్యయనాన్ని కొనసాగించారు.
తన కాలంలోని రోజువారీ రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ అంశాలపై భగత్‌సింగ్ విస్తృతంగా చదివేవారు. ఒక విప్లవ కార్యకర్తగా, ఆలోచనాపరుడిగా గడిపిన తన స్వల్పకాల జీవితంలోనే ఇన్ని చేయగలిగారంటే అతిశయోక్తి కాదు. ఆ కాలంలో పుస్తకాలు ఇప్పటిలా సులభంగా అందుబాటులో ఉండేవికావు. పైగా ఆయన నిరంతరం వలస పాలకుల నిఘా నుంచి తప్పించుకునేందుకు అటు ఇటు పరుగులు పెట్టేవారు. అయినా విభిన్న విషయాలపై ఆయన వ్యాసాలు రాయడం విశేషం. రచనలో ఆరితేరి విప్లవ పోరాటాల్లో, వ్యూహాల్లో, లక్ష్యాల్లో చేయాల్సిన మార్పులపై వాదించగల సమర్థుడయ్యాడు. వర్గ చైతన్యమే మతతత్వాన్ని నిర్మూలిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భగత్‌సింగ్. సమానత్వం, సామాజిక న్యాయం గురించి కూడా చాలా రచనలే చేశారు. ‘ప్రజలందరూ సమానులేనని, వర్గాల విభజన, అంటరానితనం అనే విభజన ఉండకూడదనీ, మతానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటామని ప్రతిజ్ఞ చేయాలి లేదా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఉరికొయ్య ముందు నిల్చొని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదమిచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి, తర్వాతి తరాలకు మార్గదర్శనమైంది.
- పి. రాజ్యలక్ష్మి
