విశ్వాస పరీక్షలో పంజాబ్ సీఎం విజయం

విశ్వాస పరీక్షలో పంజాబ్ సీఎం విజయం

పంజాబ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం భగవంత్ మాన్ విజయం సాధించాడు. మాన్ ప్రభుత్వానికి మద్ధతుగా 93 ఓట్లు పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ ఓటింగ్ ను బహిష్కరించి వాకౌట్ చేయడంతో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. తమ ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల్లో విశ్వాసం ఉందని నిరూపించడానికి భగవంత్ మాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నాడు.

స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ఆధ్వర్యంలో విశ్వాస పరీక్ష నిర్వహించగా.. 91 మంది ఆప్ ఎమ్మెల్యేలు మాన్కు మద్ధతుగా ఓటేశారు. బీఎస్పీ, ఎస్ఏడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. దీంతో 93 మంది మద్ధతిచ్చినందున విశ్వాస తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం స్పందించిన సీఎం భగవంత్ మాన్ పంజాబ్లో ఆపరేషన్ లోటస్ ఫెయిలైందని అన్నారు. ప్రజలు తనపై నమ్మకంతో అధికారం అప్పగించారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 117 మంది సభ్యులు గల పంజాబ్ అసెంబ్లీలో ఆప్కు 92, కాంగ్రెస్ 18, ఎస్ఏడీ 3, బీజేపీ ఇద్దరు సభ్యులుండగా.. బీఎస్పీ నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు.