
హైదరాబాద్: భాగ్యనగరంలో గణపయ్యల నిమజ్జనంపై గందరగోళం కంటిన్యూ అవుతోంది. ట్యాంక్ బండ్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో గణపయ్యల నిమజ్జనంపై డైలమాలో పడింది సర్కార్.. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై అధికారులు నిమజ్జనం ఏర్పాట్లు చేసుకున్నారు. అటు ట్యాంక్ బండ్‌లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది. పోలీసులు నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే.. రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి తెలిపింది. దీంతో ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు.. పోలీసులు డైలమాలో పడ్డారు. హైకోర్టు తీర్పు గణేష్ నిమజ్జనంపై నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పును సవాల్ చూస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే అలోచనలో ఉంది సర్కార్.