భైంసా ఎంపీపీ పదవి బీజేపీ కైవసం

భైంసా ఎంపీపీ పదవి బీజేపీ కైవసం

    బీఆర్ఎస్​కు గట్టి షాక్ ఇచ్చిన ఎంపీటీసీలు

భైంసా, వెలుగు: భైంసాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్​తగిలింది. ఎంపీపీ పదవిని బీజేపీ దక్కించుకుంది. బీఆర్ఎస్ ఎంపీపీ కల్పనా గణేశ్, వైస్ ఎంపీపీ గంగాధర్ వారం కింద తమ పదవులకు రాజీనామా చేశారు. అధికారులు శుక్రవారం మండల పరిషత్ ఆఫీసులో ఎన్నిక నిర్వహించగా, 10 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు బీజేపీ కండువాలను మెడలో వేసుకుని హాజరయ్యారు. భైంసా పరిధిలోని ఏకైక బీజేపీ ఎంపీటీసీ అబ్దుల్ రజాక్(మిర్జాపూర్)ను ఎంపీపీగా, కామోల్​ ఎంపీటీసీ నర్సారెడ్డిని వైస్​ ఎంపీపీగా ఎన్నుకున్నారు.

గత ఎన్నికల్లో భైంసా మండల పరిషత్​పరిధిలోని 11 ఎంపీటీసీ స్థానాల్లో 10 బీఆర్ఎస్, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్​ఎంపీటీసీలు మొత్తం బీజేపీకి జై కొట్టారు. కొత్త ఎంపీపీ, వైస్​ఎంపీపీల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అబ్దుల్​రజాక్ మాట్లాడుతూ.. తాను ఎన్నో ఏండ్లుగా మాజీ మంత్రి గడ్డెన్న కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నానని, గతంలో ఎంపీపీ పదవి ఇస్తానని గడ్డెన్న కొడుకు విఠల్​రెడ్డి, అతని సోదరుడు సూర్యంరెడ్డి మోసం చేశారని ఆవేదన చెందారు.

ఎంపీపీ పదవి కట్టబెట్టినందుకు పవర్ రామారావు పటేల్​కు కృతజ్ఞతలు తెలిపారు. తన చివరి శ్వాస వరకు పటేల్, బీజేపీ వెంటే ఉంటానని చెప్పారు. అనంతరం పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. ముథోల్ నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమన్నారు.

తమకు మైనార్టీలు వ్యతిరేకం కాదని, మైనార్టీ సోదరుడైన అబ్దుల్ రజాక్ తనకు నమ్మిన బంటువలే ఉన్నందునే ఎంపీపీ పదవి కట్టబెట్టానని స్పష్టం చేశారు. బీజేపీ దేశద్రోహులకు మాత్రమే వ్యతిరేకమని, ఏ కులానికి, మతానికి కాదన్నారు. అనంతరం నిర్వహించిన సంబురాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బి.గంగాధర్, ఏఎంసీ చైర్మన్​రాజేశ్​బాబు, బైంసా జడ్పీటీసీ సోలంకి దీపా భీంరావు పటేల్, బీజేపీ రాష్ట్ర నాయకులు బాజీరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.