ఆస్కార్ గెలిచిన తొలి ఇండియన్ మృతి

ఆస్కార్ గెలిచిన తొలి ఇండియన్ మృతి

సినిమా రంగంలో ప్రపంచంలోనే టాప్ అవార్డు ఆస్కార్. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఇండియన్ భాను అథైయా గురువారం తెల్లవారు జామున ముంబైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 1982లో వచ్చిన ‘గాంధీ’ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. 91 ఏళ్ల వయసున్న భాను కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, గురువారం తెల్లవారు జామున ఆమె నిద్రలోనే కన్నుమూశారని ఆమె కూతురు రాధిక గుప్తా తెలిపారు.

‘అమ్మకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని డాక్టర్లు ఎనిమిదేళ్ల క్రితం చెప్పారు. మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చి శరీరంలో ఒక వైపు మొత్తం చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఇన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె గురువారం తెల్లవారు జాము సమయంలో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు’ అని రాధిక చెప్పారు. సౌత్ ముంబైలోని చందన్ వాడీ స్మశానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో 1929 ఏప్రిల్ 28న పుట్టారు భాను అథైయా. 1956లో కాస్ట్యూమ్ డిజైనింగ్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆమె కస్ట్యూమ్ డిజైన్ చేసిన తొలి హిందీ సినిమా C.I.D. రిచర్డ్ అనెబరో తీసిన ‘గాంధీ’ సినిమాకు ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డు వచ్చింది. తన అవార్డును ఎప్పటికీ జాగ్రత్తగా ఉంచడం కోసం ఆమె 2012లో అకాడమీకి తిరిగి ఇచ్చారు. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనింగ్ కెరీర్ లో ఉన్న భాను దాదాపు వందకు పైగా సినిమాలకు పని చేశారు. లేకిన్, లగాన్ సినిమాలకు ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డులు వచ్చాయి.