కేసీఆర్ తీరుతో నిరుద్యోగుల జీవితాలు నాశనం: భానుప్రకాశ్

కేసీఆర్ తీరుతో నిరుద్యోగుల జీవితాలు నాశనం: భానుప్రకాశ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో 35 లక్షల నిరుద్యోగుల జీవితాలు నాశనం అయ్యాయని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భానుప్రకాశ్ ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ తీరుతో యువత మనో వేదనకు గురవుతోందన్నారు. బుధవారం పార్టీ స్టేట్​ఆఫీసులో భాను ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. ‘పరీక్షలు వాయిదా పడ్డాయన్న కారణంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు అశోక్ నగర్ వెళ్లాము. 

అదే టైమ్ లో పోలీసులు మాపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నాకు, పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ కు గాయాలయ్యాయి’ అని ఆయన అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయకుండా ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరుద్యోగులకు అండగా ఉంటాం.. వాళ్ల భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.